తాగిన మైకంలోనే..

TRS Leader Murder Case Revealed - Sakshi

టీఆర్‌ఎస్‌ నేత వీఎస్‌రావు హత్య కేసులో వీడిన మిస్టరీ

నిందితుల అరెస్టు

సనత్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ నేత వల్లభు శ్రీనివాసరావు హత్య కేసు మిస్టరీ వీడింది.  ఈ నెల 15న అర్ధరాత్రి సనత్‌నగర్‌ బస్టాండ్‌ సమీపంలోని  ఖాళీ స్థలంలో వీఎస్‌రావును హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడి సోదరి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు  తాగిన మైకంలో జరిగిన వివాదమే హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు.  ఈ కేసుకు సంబంధించి ఆరుగురుగు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నారు. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తె వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీఎస్‌రావు లింగయ్యనగర్‌ సాయి జయ ఆర్చిడ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌గా పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన అతడికి స్థానికంగా పలువురితో విబేధాలు ఉన్నాయి. 

ఈ నెల 15వ తేదీ రాత్రి గంగానగర్‌కు చెందిన మిర్జా హరూన్‌బేగ్, తన స్నేహితులు అశోక్‌కాలనీకి చెందిన మహ్మద్‌ ఇబ్రహీం,, మహ్మద్‌ ఖలీల్‌ , తాజుద్దీన్‌తో కలిసి సనత్‌నగర్‌ బస్టాండ్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం సేవించారు.  అదే సమయంలో వీఎస్‌రావు డ్రైవర్‌ సునీల్‌సింగ్‌ జాదవ్‌ కనిపించడంతో హరున్‌ అతనిని అడ్డుకుని వీఎస్‌రావు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పాడు. దీంతో అతను వీఎస్‌రావు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్నట్లు చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి వీఎస్‌ రావును కలిసి, తమకు మద్యం తాగించాలని కోరారు. అనంతరం అందరూ కలిసి బీరు బాటిళ్లు తీసుకుని ఖాళీ ప్లాట్‌కు వచ్చారు. హరుర్, వీఎస్‌రావు మద్యం తాగుతుండగా, సయ్యద్‌యాసిన్‌ అలీ కొద్ది దూరంలో కూర్చున్నాడు. అబ్రార్, ఖలీల్, తాజుద్దీన్, సునీల్‌సింగ్‌ జాదవ్‌ తమకు మద్యం చాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

అందరితో అనవసరంగా గొడవలకు దిగుతున్నావంటూ హరుర్‌ రావుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, తనపై అనవసర ఆరోపణలు చేస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో మాటా మాటా పెరిగి  ఘర్షణకు దారి తీసింది. వీఎస్‌రావును చంపాలని నిర్ణయించుకున్న హరుర్‌ తన స్నేహితుడు ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ యాసిన్‌ అలీకి ఫోన్‌ చేశాడు. సాజిద్‌ అక్కడికి వచ్చేసరికి ఇద్దరూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో హరుర్‌ తన చేతిలోని బీర్‌ బాటిల్‌తో వీఎస్‌రావు తలపై కొట్టగా, సాజిద్‌ అక్కడే ఉన్న గడప చెక్కతో తలపై బలంగా మోదడంతో అతను కుప్పకూలాడు. అనంతరం అక్కడే ఉన్న గ్రనైట్‌ రాయితో అతని తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి పరారవుతున్న వారికి స్నేహితులు ఎదురుపడటంతో తాము వీఎస్‌రావు చంపేశామని, అటువైపు వెళ్లవద్దని చెప్పడంతో ఏడురుగు అక్కడి నుంచి పరారయ్యారు.

కేసు చేదించారిలా...
వీఎస్‌రావు ఫోన్‌ కాల్‌ డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. క్షణికావేశంతో  చేసిన హత్యేనని, పథకం ప్రకారం చేసింది కాదని విచారణలో వెల్లడించారు. హత్య తరువాత పరారైన హరుర్, యాసిన్‌ అలీ ఖర్చుల నిమిత్తం అబ్రార్, ఖలీల్, తాజుద్దీన్‌ డబ్బులు పంపించినట్లుగా అంగీకరించారు. హత్య విషయం దాచిపెట్టిన సునీల్‌సింగ్‌ జాదవ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సాజిద్‌ పరారీలో ఉన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top