పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Goods Rail Diversion And Trains Become Late - Sakshi

సాక్షి, అనంతగిరి: ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన సంఘటన జిల్లాకేంద్రం వికారాబాద్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ నుంచి  రాయిచూర్‌కు బొగ్గు లోడ్‌తో గూడ్స్‌ రైలు వికారాబాద్‌ మీదుగా వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున వికారాబాద్‌ సమీపానికి రాగానే కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 7 బోగీలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. బోగీలు కిందపడడంతో పట్టాలు పూర్తిగా దెబ్బతినఆనయి. అయితే రైలుముందు భాగం, వెనుకభాగానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం 7 బోగీలు ప్రమాదానికి గురవ్వగా 4 బోగీలు కిందికిదిగాయి. 

ఈ సంఘటనతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అక్కడికు చేరుకున్నారు. ప్రమాదం తీరును పరిశీలించారు. హుటాహుటిన సిబ్బందిని పిలిపించి జేసీబీతో బొగ్గును, కిందపడిన బోగిలను పక్కకు జరిపారు. బోగీలను పక్కకు తొలగించిన అనంతరం పట్టాలకు మరమ్మతు పనులు చేస్తున్నారు. బోగీలను రైల్వే ట్రాక్‌ మీద నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణం బోగీల తప్పిదమా లేక రైలు పట్టాల తప్పిదమా తెలియాల్సి ఉంది.. కాగా ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఘటన స్థలాన్ని సికింద్రాబాద్‌ రైల్వే చీఫ్‌ సెక్యూరిటీ కమీషనర్‌ రమేష్‌ చందర్, జీయం గజానంద్‌ మల్యా, డీఆర్‌యం ఆనంద్‌ భటియా, సీనియర్‌ డీవిజనల్‌ సెక్యూరిటి కమీషనర్‌ రామకృష్ణ, ఏఎస్‌స్‌  ఉజ్జల్‌ దాస్, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్పాల్‌ లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది వచ్చారు.  

పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా 
ఈ ప్రమాదంతో హైదాబాద్‌ నుంచి వికారాబాద్‌ వైపు వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్‌ పూర్తిగా దెబ్బతినడంతో కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పట్టాలు ఊడిపోవడంతో సిబ్బంది సరి చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ నుంచి వచ్చే రైళ్లను చిట్టిగడ్డ రైల్వేస్టేషన్‌కు రాగానే నిలిపివేస్తున్నారు.  వికారాబాద్‌ నుంచి హైదరా బాద్‌ వైపు వెళ్లే రైళ్లు లేని సమయంలో లేదా అటు నుంచి వచ్చే రైళ్లను ఆపి ఒకే ట్రాక్‌ మీద రైళ్ల రాకపోకలను కొనసాగించారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

పలు రైళ్లు రద్దు.. 
కాగా ప్రమాదంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌–గుల్బర్గా (57156), గుల్బర్గా–హైదరాబాద్‌(57155), సికింద్రాబాద్‌–తాండూరు (67250), తాండూరు–సికింద్రాబాద్‌ (67249) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు నుంచి వికారాబాద్‌ వరకు వచ్చే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకే నడిపారు. సికింద్రాబాద్‌–వికారాబాద్‌ ప్యాసింజర్‌ను శంకర్‌పల్లి వరకే నడిపించారు. ఈ ప్రమాదంతో వికారాబాద్‌ మీదుగా వెళ్లే రైళ్లన్నీ సుమారు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్, తాండూరుకు వెళ్లే ఎన్నికల సిబ్బంది కూడా ఈ ప్రమాదంతో ఆలస్యంగా విధులకు చేరుకున్నారు. పలువురు ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top