ఎంఎంటీఎస్‌కు గూడ్స్‌ బ్రేక్‌

Goods Trains More Crucial In South Central Railway Than MMTS  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే ఎంఎంటీఎస్‌ ఎంతో ముఖ్యం. హైదరాబాద్‌ ప్రజల రాకపోకలకు ఎంఎంటీఎస్‌ ‘లైఫ్‌లైన్‌’.  ...ఇది ఒకప్పటి దక్షిణమధ్య రైల్వే ప్రాధాన్యం. అలాంటి ఎంఎంటీఎస్‌ రైళ్ల లక్ష్యం నీరుగారుతోంది. ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణ కంటే ఇప్పుడు గూడ్స్‌ రైళ్లే దక్షిణ మధ్య రైల్వేకు కీలకంగా మారాయి. బైపాస్‌ మార్గాల్లో వెళ్లవలసిన గూడ్స్‌ రైళ్లను సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా నడుపుతూ ఎంఎంటీఎస్‌ రైళ్లను నిలిపివేస్తున్నారు.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి వంటి ప్రధాన రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రయాణికుల రైళ్లు మాత్రమే నడపాల్సి ఉండగా  కొంతకాలంగా ఈ స్టేషన్ల నుంచి గూడ్స్‌ రైళ్లను సైతం నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ప్రత్యేకించి సికింద్రాబాద్‌ మీదుగా నడిచే గూడ్స్‌ వల్ల  ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయడంతో పాటు  పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు  స్టేషన్‌కు చేరుకోవడంలో జాప్యం నెలకొంటోంది.

ప్రతి  రోజు తెల్లవారు జామునే  సికింద్రాబాద్‌కు చేరుకోవలసిన రైళ్లు  మౌలాలీ,  చర్లపల్లి స్టేషన్‌లలో  నిలిచిపోతున్నట్లు  ప్రయాణికులు  ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎంఎంటీఎస్‌లపైన ప్రయాణికులు క్రమంగా నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుంది.  

బైపాస్‌ ఉన్నా ఎందుకిలా... 
విజయవాడ, కాజీపేట్‌ తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లే సరుకు రవాణా రైళ్లు బైపాస్‌ మార్గంలో మౌలాలి–సనత్‌నగర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. కానీ కోవిడ్‌ కాలంలో పాలు, కూరగాయలు, అత్యవసర వస్తువులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు  ప్రధాన రైల్వేస్టేషన్‌ల మీదుగా గూడ్స్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్‌ అనంతరం పాత రూట్‌లలో ఈ రైళ్లను పునరుద్ధరించకపోవడం గమనార్హం.

కాజీపేట్‌  వైపు నుంచి వచ్చే పలు సరుకు రవాణా రైళ్లు ఇప్పటికీ సికింద్రాబాద్‌ నుంచే నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికుల రైళ్ల నిర్వహణపైన  ప్రభావం పడుతుంది. గూడ్స్‌ రైళ్ల కోసం ఏకంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయడం గమనార్హం. ఒక్క శని, ఆదివారాలు రెండు రోజుల్లోనే  68 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నిలిపివేయడం గమనార్హం. కోవిడ్‌ అనంతరం  ఎంఎంటీఎస్‌ రైళ్ల కచ్చితమైన సమయపాలనను పునరుద్ధరించకపోవడమే కాకుండా సర్వీసులను కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

ప్రత్యామ్నాయంగా సిటీ బస్సులు... 
ఎంఎంటీఎస్‌ రైళ్లకు బ్రేకులు పడుతూండడంతో ఆయా మార్గాలపైన ఆర్టీసీ దృష్టి సారించింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లి వరకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో అదనపు బస్సులను  ఏర్పాటు  చేస్తున్నారు. వివిధ రూట్లలో 280 కి పైగా అదనపు ట్రిప్పులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సగానికి తగ్గిన సర్వీసులు... కోవిడ్‌కు ముందు  సికింద్రాబాద్‌–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, తదితర రూట్లలో  రోజుకు 121 సర్వీసులు నడిచాయి.1.5 లక్షల మంది ప్రయాణం చేశారు.  

కోవిడ్‌ అనంతరం దశలవారీగా  70 నుంచి 80  రైళ్లను మాత్రమే పునరుద్ధరించారు.కానీ కచ్చితమై సమయపాలన లేకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఉన్న సర్వీసుల్లోనూ వీకెండ్స్‌లో 34 నుంచి 40 రైళ్లను రద్దు చేస్తున్నారు. మిగతా రోజుల్లోనూ  ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒకప్పుడు లక్షన్నర మందికి రవాణా సదుపాయం కల్పించిన రైళ్లలో ఇప్పుడు 25 వేల మంది కూడా ప్రయాణం చేయడం లేదు.  

(చదవండి: క్లబ్‌ టెకీల అంశంలో... మరో ఇన్‌స్పెక్టర్‌కు పబ్‌ దెబ్బ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top