
సాక్షి, బంజారాహిల్స్ : ‘దిశ’ ఘటనను మరిచిపోకముందే ముగ్గురు మైనర్లు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. రోడ్ నంబర్ 10లోని గఫార్‌ఖాన్ కాలనీలో నివసిస్తున్న ఓ యువతి సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఫిలింనగర్‌లో దర్శక, నిర్మాతలతో మాట్లాడి స్నేహితుడితో కలసి కారులో బసవతారక కేన్సర్ ఆసుపత్రి నుంచి జహీరానగర్ వైపు వస్తుండగా వెనుకాల నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఆ కారు డ్రైవర్ అజీజ్‌కు, వీరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అజీజ్‌కు చెందిన ముగ్గురు మైనర్లు అక్కడకు చేరుకుని యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుస్తులు చించేశారు. కారులో కూర్చున్నాక చేతులు లోపలికి పెట్టి ఆమె ను తాకుతూ హింసించారు. ఈ ఘటన జరుగుతుండగా ఆమె 100కు డయల్ చేసింది. అనంతరం స్థానిక ఎస్‌ఐకి సమాచారం ఇచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి కోసం గాలిస్తున్నారు.