పాయల్‌ తాడ్వీ ఆత్మహత్య; ముగ్గురు అరెస్ట్‌

Three Doctors Held in Payal Tadvi Suicide Case - Sakshi

ముంబై: కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలి కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్‌ తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్‌ నిరోధ​క చట్టం, ఐటీ యాక్ట్‌, సెక్షన్‌ 360 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసులు పెట్టారు. దర్యాప్తులో భాగంగా బుధవారం తెల్లవారుజామున అంకితా ఖండేల్వాల్‌ను అగ్రిపడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి హేమ అహుజాను, అదేరోజు సాయంత్రం భక్తి మహెరేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందుస్తు బెయిల్‌ కోసం వీరు ముగ్గురు సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ నేడు కోర్టులో విచారణకు రానుంది.

పాయల్‌ తల్లిదండ్రులు మంగళవారం ఆమె పని చేస్తున్న ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. వీరికి దళిత, గిరిజన సంస్థలకు చెందిన కార్యకర్తలు మద్దతు పలికారు. పాయల్‌ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురు డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రోగుల ముందే వారు తన ముఖం మీద ఫైళ్లను విసిరి కొట్టేవారని కూతురు తమకు చెప్పేదని ఆమె తల్లి వెల్లడించింది. దీంతో పలుమార్లు వారిపై ఫిర్యాదు చేయమని మేం చెప్పగా, అలా చేస్తే వారి కెరియర్‌ దెబ్బతింటుందంటూ ఊరుకునేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top