సరదా.. విషాదమాయె!

Three Children Died In Pond In Mahabubnagar - Sakshi

ఆ నలుగురు విద్యార్థులు వేసవి సెలవుల్లో తమకు నచ్చిన ఆటలు ఆడారు.. సమీపంలోని చెరువులో సరదాగా చేపలుపడదామని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో బాలుడిని స్థానికులు గమనించి రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. మృతుల్లో అన్న, చెల్లెలు ఉండటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. 

కందనూలు (నాగర్‌కర్నూల్‌): బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌కు చెందిన బొక్కి శైలజ (12), మండల స్వాతి (9), అనిల్‌ (10), గణేష్‌ సమీపంలోని సూరయ్యకుంట చెరువులో చేపలు పట్టేందుకు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లారు. ఈ క్రమంలోనే గణేష్‌ తప్పా మిగతా ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడటం గ్రామస్తులను కలచివేసింది. అనంతరం ముగ్గురి మృతదేహాలను స్థానికులు గాలించి వెలికితీశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా, ఇదే గ్రామానికి చెందిన మండల అంజనమ్మ, చంద్రయ్య దంపతులకు ఇద్దరు సంతానం. అందులో అనిల్, స్వాతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. తమకున్న ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. ఇక బొక్కి చెన్నమ్మ నాగయ్య, దంపతుల నాలుగో సంతా నమే  శైలజ. ఈ బాలిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృతి చెందడంతో తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబాలను సర్పంచ్‌ వంగా సుదర్శన్‌గౌడ్‌ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మీనర్సింహ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారుల మృతదేహాల వద్ద  కుటుంబ సభ్యుల రోదనలు  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top