ఏం చెబుతాడో ఏమో!

tdp leaders fear on rowdy sheeter subbu arrest - Sakshi

రౌడీషీటర్‌ సుబ్బు అరెస్టుతో టీడీపీ నేతల్లో గుబులు

విచారణ నిమిత్తం తెలంగాణ పోలీసులకు అప్పగింత

అతడిని కాపాడేందుకు రంగంలోకి టీడీపీ పెద్దలు

సాక్షి, అమరావతిబ్యూరో : తెలంగాణ పోలీసుల విచారణలో రౌడీషీటర్‌ సుబ్బు ఏమి చెబుతాడో ఏమో..? ఎలాగైనా అతడిని రక్షించాలి... ఇదొక్కటే ప్రస్తుతం విజయవాడకు చెందిన టీడీపీ పెద్దల ముందున్న ఏకైక లక్ష్యం. అక్రమంగా ఆయుధాల కొనుగోలుకు యత్నించిన కేసులో అతడిని రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ పోలీ సులకు అప్పగించారు. అక్కడి పోలీసుల విచారణలో సుబ్బ ఏ విషయాలు బయటపెడతాడో...? అవి తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అనే గుబులు విజయవాడ టీడీపీ పెద్దలకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ మీడియాకు వెల్లడించారు.

టీడీపీ పెద్దల అండతోనే...!?
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్‌ వేమూరి సుబ్బు ఓ రౌడీ షీటర్‌. అతడిని విజయవాడ టీడీపీ పెద్దలు మరింతగా పెంచిపోషించారు. తమ రాజకీయ అవసరాల కోసం అతడికి అండదండలు అందించారు. సుబ్బు విజయవాడకు చేరిన కొత్తలో కొన్నాళ్లు కాట్రగడ్డ శ్రీనుకు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే వంగవీటి శంతన్‌కుమార్‌పై జరి గిన కాల్పుల కేసులో అతడిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అనంతరం సుబ్బు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గంలో చేరాడు. కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే బొండాకు అత్యంత సన్నిహితుడిగా మారడం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సుబ్బు సాన్నిహిత్యం పెంచుకున్నాడని ఫొటో ఆధారాలు చెబుతున్నాయి. సుబ్బు రాజ రాజేశ్వరిపేట కేంద్రంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలతోనే సుబ్బు అంతగా చెలరేగిపోతున్నాడని కూడా పోలీసులు గుర్తించారు. విజయవాడలో సద్దుమణిగిందనుకున్న రౌడీ వ్యవస్థను టీడీపీ పెద్దలు మళ్లీ పెంచిపోషించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మూడేళ్లలో మళ్లీ రౌడీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

టీడీపీ పెద్దల్లో కలవరం
హైదరాబాద్‌ పోలీసులు ఛేదించిన అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో సుబ్బు పాత్ర బయటపడంతో టీడీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. తెనాలిలో ప్రతీకార దాడుల కోసమే సుబ్బు అక్రమంగా ఆయుధాల కొనుగోలుకు యత్నించాడని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే ఈ కేసులో అంతకుమించిన కోణం ఉందని తెలుస్తోంది. అదేమిటన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉన్నప్పటికీ పోలీసువర్గాల్లో కలకలం రేపుతోంది. మరో వైపు సుబ్బును విజయవాడ పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ పోలీసులకు అప్పగించారు. తెలంగాణ పోలీసుల విచారణలో అతను ఏం చేబుతాడోనని టీడీపీ పెద్దలు కలవరపడుతున్నారు. అక్రమ ఆయుధాల కొనుగోలు యత్నం వెనుక టీడీపీ పెద్దల ప్రయోజనాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారిస్తే తీవ్ర సంచలనంగా మారుతుంది.

దీంతో అతడిని రక్షించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు విజయవాడకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన కొందరు ఉన్నతాధికారులు, పెద్దలతో తమకున్న పరిచయాలను తిరగదోడుతూ మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. వీలైనంత త్వరగా సుబ్బుకు బెయిల్‌ వచ్చేలా చేసేందుకు ఇప్పటికే కొందరిని హైదరాబాద్‌కు పంపించి నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల విచారణతో అక్రమ ఆయుధాల కేసు, దానితో విజయవాడకు ఉన్న సంబంధాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

శాంతిభద్రతలను పరిరక్షిస్తాం : సీపీ సవాంగ్‌
రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ స్పష్టంచేశారు. విజ యవాడలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. సుబ్బుపై గతంలో తెనాలిలో రౌడీషీట్‌ ఉందని తెలిపారు. గతంలో విజయవాడలో శంతన్‌కుమార్‌పై జరిగిన కాల్పుల కేసులో అతను నింది తుడని కూడా చెప్పారు. అయితే ఆ కేసును 2012లో కొట్టివేశారన్నారు. 2014లో తెనాలిలో మేడిశెట్టి కృష్ణ హత్య కేసులో ఇతను నిందితుడని చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా తెనాలిలో ఉండొద్దని అక్కడ పోలీసులు చెప్పడంతో సుబ్బు విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు వచ్చి వెళ్తున్నాడని వివరించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఈశ్వర్‌రెడ్డితో సుబ్బుకు పరిచయం ఉందన్నారు. ఈశ్వర్‌రెడ్డి చత్తీస్‌ఘడ్‌లో ఉండగా బిహార్‌కు చెందిన పప్పూతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. సుబ్బుకు విక్రయించేందుకే పప్పూ వద్ద రెండు తుపాకులు కొన్నానని ఈశ్వర్‌రెడ్డి తెలంగాణ పోలీసుల విచారణలో వెల్లడించాడని సీపీ సవాంగ్‌ చెప్పారు. తనవద్ద ఆ తుపాకులు ఉన్నాయనే ఈశ్వర్‌రెడ్డి చెప్పాడని, తాను మాత్రం కొనుగోలు చేస్తాననలేదని సుబ్బు తమ విచారణలో చెప్పాడని సీపీ వివరించారు. ఈ కేసులో వాస్తవాలేమిటో తెలుసుకునేందుకే సుబ్బును తెలంగాణ పోలీసులకు అప్పగించామని  చెప్పారు.   

ఈనెల 28వ తేదీన విజయవాడలో ప్రొఫెసర్‌ ఐలయ్య నిర్వహించే సభ కోసం ఇంత వరకు తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీ సవాంగ్‌ సమాధానం చెప్పారు. అనుమతి కోరితే నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top