
బాపట్ల: స్థల వ్యవహారంలో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్రవర్మరాజు మాజీ డ్రైవర్ కె.వీరేశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు వీరేశ్ కథనం ప్రకారం... వేగేశన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసినప్పుడు ఐదు సెంట్ల స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. నరేంద్రవర్మ దగ్గర పని మానే సమయంలో తిరిగి భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బాధితుడు కోరాడు. ఆ స్థలం తన పేరుతో ఉండటం వల్ల తాను ప్రభుత్వం ఇచ్చే స్థలానికి అనర్హుడిని అవుతానని, ఆ స్థలాన్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడు. అయితే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వేగేశనను ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు కాదంటూ కాలం వెళ్లబుచ్చారని తెలిపారు. ఈక్రమంలోనే వీరేశ్ పేరిట భూమి ఉండటంతో ప్రభుత్వం అందించే నివాస స్థలం అతనికి అందలేదు. అయితే ఇటీవల వేగేశన అనుచరులు గోపి, చటర్జీ ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని, దీంతో ఆందోళనకు గురై నిద్రమాత్రలు మింగినట్లు వీరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.