చారి.. జైలుకు పదకొండోసారి!

Task Force police Caught the Accused Surya Prakash Chary - Sakshi

2009 నుంచి ఇదే పంథా అనుసరిస్తున్న సూర్యప్రకాశ్‌చారి 

నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: అతడో ‘అవతార’పురుషుడు. చిన్నమొత్తాలు కొల్లగొట్టే పెద్దదొంగ. పేరు రాయబండి సూర్యప్రకాశ్‌చారి... ఇంటర్మీడియెట్‌ కూడా పాస్‌ కాలేదు... అయితేనేం.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని అధికారినని చెప్పుకుంటాడు... నకిలీ జర్నలిస్ట్‌ అవతారం ఎత్తుతాడు.. సన్మానాలు, అన్నదాన కార్యక్రమాల పేరిట ప్రభుత్వాధికారులకు ఎరవేస్తాడు. బదిలీల పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటాడు. ఈ ఘరానా మోసగాడిని మధ్యమండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. సూర్యప్రకాశ్‌చారి ఇప్పటివరకు 11 సార్లు కటకటాల్లోకి వెళ్లాడు. అతడు ఏ నేరంలోనూ రూ.లక్షకు మించి వసూలు చేయలేదు. చిన్న మొత్తాలు అయితేనే అధికారులు పెద్దగా పట్టించుకోరని ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు.  

నకిలీ విలేకరి అవతారంతో మొదలు... 
రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు చెందిన రాయబండి సూర్యప్రకాశ్‌చారి ఉప్పల్‌లోని కళ్యాణ్‌పురి కాలనీలో నివసిస్తున్నాడు. ఇతగాడికి ఆర్‌ఎస్పీ చారి, సూరిబాబు, ప్రకాశ్‌ అనే మారు పేర్లూ ఉన్నాయి. నగరానికి వలసవచ్చి కొన్ని దిన, వార పత్రికల్లో పనిచేశాడు. ఇతడి ప్రవర్తన కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయినా, హైదరాబాద్, సైబరా బాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అనేక స్కూళ్లు, ఆస్పత్రులకు కాల్‌ చేసి ప్రముఖ దినపత్రికలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకునేవాడు. తమ పత్రిక తరఫున భారీ ఈవెంట్‌ జరుగుతోందని, విరాళాలు ఇవ్వాలని అందినకాడికి దండుకునేవాడు. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడినంటూ చెప్పి పలువురి దగ్గర డబ్బు వసూలు చేశాడు.
 
మున్సిపల్‌ కమిషనర్, ఐఏఎస్‌ సైతం... 
ఈ తరహా నేరాలకు పాల్పడుతూ 2009 నుంచి కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్‌పేట్, హయత్‌నగర్, చైతన్యపురి, సనత్‌నగర్, హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి మోసాల బారినపడినవారిలో మున్సిపల్‌ కమిషనర్, ఐఏఎస్‌ అధికారి సైతం ఉన్నారు. 2016లో కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎ.రాణిరెడ్డికి అతడు ఫోన్‌కాల్‌ చేసి సీఎంవో నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. జిల్లాస్థాయిలో ఉత్తమ అధికారిణిగా ఎంపికయ్యారని, రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం చేయనున్నామని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.35 వేలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా నంబర్‌ను ఎస్సెమ్మెస్‌ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రాణిరెడ్డి సీఎంవోలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె అప్పట్లో హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు బ్యాంకు అకౌంట్, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సూర్యప్రకాశ్‌చారిని గుర్తించి అరెస్టు చేశారు. ఆ తరువాత ఓ ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదుతో ఇతగాడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.
 
తాజాగా రిజిస్ట్రేషన్స్‌ శాఖ టార్గెట్‌  
ఈ మోసగాడు తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖలోని సబ్‌–రిజిస్ట్రార్లను లక్ష్యంగా ఎంచుకున్నాడు. సిద్ధిపేట, జగిత్యాల, షాద్‌నగర్, చౌటుప్పల్, వరంగల్, శామీర్‌పేటలకు చెందిన ఎస్‌ఆర్వోలకు కాల్‌ చేసి తెలంగాణ పోరాటయోధుల కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేయడానికి రూ.లక్ష డొనేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తక్షణం తాను చెప్పిన బ్యాంకుఖాతాలో వేయాలని, లేదంటే, మారుమూల ప్రాంతానికి బదిలీ చేయిస్తానని బెదిరించడంతో సిద్ధిపేట రూరల్‌ ఎస్‌ఆర్వో, టౌన్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఆర్వోలు రూ.55 వేలు, సంగారెడ్డికి చెందిన ఓ ఎస్‌ఆర్వో రూ.30 వేలు డిపాజిట్‌ చేశారు. సదరు ఎస్‌ఆర్వోలు సీఎంవోలో ఆరా తీయగా సూర్యప్రకాశ్‌చారి అనే వ్యక్తి ఎవరూ లేరని తేలింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top