
11 నెలలుగా చిల్లిగవ్వ కూడా స్టాంప్ డ్యూటీ ఇవ్వని టీడీపీ కూటమి సర్కారు
ఆస్తుల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే స్టాంప్ డ్యూటీ 6.5 శాతం
అందులో 5 శాతం ప్రభుత్వానికి, 1.5 శాతం స్థానిక సంస్థలకు..
ఇదే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు
అది స్థానిక సంస్థలకు ఇవ్వొద్దని సబ్ రిజిస్ట్రార్లకు మౌఖిక ఆదేశాలు
ఎవరైనా ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు
దీంతో ఆదాయంలేక జీతాలివ్వలేని దుస్థితిలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు
నెట్ రెవెన్యూను ఎక్కువ చూపించుకునేందుకు ‘స్థానిక’ సంస్థలు బలి
రియల్ ఎస్టేట్ పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా తగ్గుదల
ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఆదాయం మళ్లించబోనని చెప్పిన పవన్‌కళ్యాణ్
ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ తన వద్దే ఉన్నా నోరువిప్పని డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను ఉద్ధరిస్తామని మాయ మాటలు చెప్పిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా.. వాటిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఆ సంస్థలకు హక్కుగా రావాల్సిన నిధుల్ని సైతం ఇవ్వకుండా వాటిని మళ్లిస్తున్నారు. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటాలో పైసా కూడా ఇవ్వకుండా నిలిపివేశారు.
ఫలితంగా.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పైగా.. సబ్ రిజి్రస్టార్లు ఎవరూ స్థానిక సంస్థల వాటా నిధులు విడుదల చెయ్యొద్దని మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా తమకు తెలీకుండా నిధులు విడుదల చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా 11 నెలలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో చిల్లిగవ్వ కూడా స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు.
రూ.2 వేల కోట్లు విడుదల చేయలేదు
నిజానికి.. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లిస్తారు. అందులో 5 శాతం ప్రభుత్వానికి, 1.5 శాతం స్థానిక సంస్థలకు వెళ్తుంది. ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లించాలి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం మొత్తం 6.5 శాతం స్టాంప్ డ్యూటీని తీసేసుకుని ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా స్థూల ఆదాయం రూ.9 వేల కోట్లు వచ్చింది. ఇందులో స్థానిక సంస్థల వాటా 1.5 శాతం అంటే సుమారు రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి వుంది.
కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు నిధుల్లేక అల్లాడుతున్నాయి. ఎందుకంటే.. వాటికి ఇదే ప్రధాన ఆదాయ వనరు. దీంతో అనేక స్థానిక సంస్థల్లో ఇప్పుడు పారిశుధ్య కారి్మకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. రోడ్లు, డ్రెయిన్ల వంటి కనీస మౌలిక సదుపాయాల మరమ్మతులూ చేయించలేకపోతున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఆదాయం తగ్గిపోయినట్లు కనపడుతుందని..
నిజానికి.. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆదాయం తగ్గినట్లు చూపిస్తే ఇబ్బంది వస్తుందనే భయంతో స్టాంప్ డ్యూటీ వాటా గురించి అసలు ఎక్కడా మాట్లాడడంలేదు. సాధారణంగా.. స్టాంప్ డ్యూటీ కింద వచ్చిన మొత్తంలో స్థానిక సంస్థలు, ఇతర ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ల ఆదాయంగా చూపిస్తారు.
అంటే.. స్థూల ఆదాయంలో ఖర్చులు, ఇతర శాఖలకు ఇవ్వాల్సిన వాటిని తీసివేసి నికర ఆదాయాన్ని చూపిస్తారు. అందులో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటా కూడా ఉంటుంది.అయితే, గత ఆర్థిక సంవత్సరం స్థూల ఆదాయం భారీగా తగ్గిపోవడంతో స్థానిక సంస్థలకు వాటి వాటా నిధులు ఇవ్వడంలేదు. ఇస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకా తగ్గిపోయినట్లు కనబడుతుందనే కారణంతో విడుదల చేయడంలేదని అధికారులు చెబుతున్నారు.
నోరు మెదపని పవన్..
అయితే, తమకు రావాల్సిన నిధులు ఇవ్వాలని పలుచోట్ల సర్పంచ్‌లు, మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజి్రస్టార్ల వద్దకు వచ్చి అడుగుతున్నారు. కొందరైతే ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు. తమ వాటా విడుదల చెయ్యొద్దని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలుంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి వచ్చింది మౌఖిక ఆదేశాలు కావడంతో సబ్ రిజిస్ట్రార్లు మిన్నకుండి పోతున్నారు.
ఈ వ్యవహారం తన శాఖకు సంబంధించినదైనా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నోరు మెదపడంలేదు. పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన నిధులను ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్లిస్తున్నా ఆయన చోద్యం చూస్తుండడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు అన్యాయం జరగనివ్వనని కాకినాడలో సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆయన అనేక హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు తన శాఖకు రావల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన ఆయన ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వారు రగిలిపోతున్నారు.