జైల్లో జట్టుకట్టి పథకం వేసి.. | Task Force Police arrested the Chain Snatching gang | Sakshi
Sakshi News home page

జైల్లో జట్టుకట్టి పథకం వేసి..

Jan 10 2019 1:08 AM | Updated on Jan 10 2019 4:20 AM

Task Force Police arrested the Chain Snatching gang - Sakshi

బుధవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో గతేడాది డిసెంబర్‌ ఆఖరివారంలో వరుస గొలుసు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్రముఠా గుట్టును హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటుగా హైదరాబాద్‌ వాసి చింతమల్ల ప్రణీత్‌ చౌదరిలు ముఠాగా ఏర్పడి ఈ వరుస గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం లండన్‌ వెళ్లి డిపోర్టేషన్‌పై తిరిగి వచ్చి నేర జీవితాన్ని ఎంచుకున్న ప్రణీత్‌ చౌదరే ఈ ముఠాకు సూత్రధారిగా తేల్చారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠా ఆట కట్టించడమే కాకుండా వారినుంచి మొత్తం సొత్తును రికవరీ చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ చెప్పారు. తన కార్యాలయంలో ఈ ముఠాకు సంబంధించి పూర్తి వివరాలను బుధవారం ఆయన మీడియాకు వెల్లడించారు.  

వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ప్రణీత్‌ ఇంజనీరింగ్‌ చదువు మధ్యలోనే ఆపి బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివేందుకు లండన్‌కు వెళ్లాడు. ముందస్తు సమాచారం లేకుండా భారత్‌కు వచ్చి వెళ్లడంతో ప్రణీత్‌ను అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు డిపోర్టేషన్‌ పద్ధతిలో తిప్పిపంపేశారు. అప్పట్నుంచి నేరజీవితం ప్రారంభించిన ప్రణీత్‌ తన వద్ద ఉన్న అమెరికా డాలర్లు మార్పిడి చేసుకోవచ్చంటూ ఆశ చూపించి చాలామందిని మోసం చేశాడు. 2014–15 ఏడాదిలో సరూర్‌నగర్, ఉప్పల్‌తోపాటు నోయిడాలోను పలు నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. 2015లో ప్రణీత్‌పై గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ ప్రయోగించడంతో రెండున్నరేళ్ల పాటు నోయిడా సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. ఇదే జైలులో స్నాచింగ్స్, దోపిడీ నేరాలతో జైలు శిక్ష అనుభవిస్తున్న యూపీకి చెందిన ఛోకా, మోను వాల్మీకితో ప్రణీత్‌ చౌదరికి పరిచయమేర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గొలుసు చోరీలు చేయాలని పథకం వేశారు. 

ముందు రెక్కీ...ఆపై చోరీలు 
ఎల్బీనగర్‌ జోన్‌పై ప్రణీత్‌కు మంచి పట్టుండటంతో ప్రధాన రహదారికి ఆనుకుని ఏయే చోట్ల స్నాచింగ్‌ చేయాలి? ఏ రూట్‌లో పారిపోవాలి అన్న విషయాలు ముందే ఆలోచించి పెట్టుకున్నాడు. గత నెల 24న ఛోకా, మోనులను హైదరాబాద్‌ రప్పించి కాచిగూడలోని లాడ్జిలో బస ఏర్పాటు చేశాడు. చోరీలు చేసేందుకు ఓఎల్‌ఎక్స్‌లో మలక్‌పేటకు చెందిన సోఫి యాన్‌ నుంచి కేటీఎం బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ దీనిపై, ప్రణీత్‌ పల్సర్‌ బైక్‌పై తిరుగుతూ గతనెల 24, 25 తేదీల్లో రెక్కీలు నిర్వహించారు. 26 సాయంత్రం ప్రణీత్‌ లాడ్జిలోనే ఉండిపోగా.. ఛోకా, మోనులిద్దరూ సాయంత్రం 4.40 నుంచి రాత్రి 8.55 మధ్య మీర్‌పేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్‌ల్లో 5 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. ఆ రాత్రి లాడ్జిలో ఉండి మరుసటి రోజు ఉదయం 7 నుంచి 7.40 వరకు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో 5 స్నాచింగ్స్‌ చేసి తిరిగి లాడ్జికి వెళ్లిపోయారు. అదేరోజు వాహనాన్ని భవానీనగర్‌ ఠాణా పరిధిలో వదిలేసి ముగ్గురూ కలిసి ఉత్తరాదికి పారిపోయారు.

దారి చూపిన గూగుల్‌ పే
ఈ కేసులన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగినప్పటికీ హైదరాబాద్‌ పోలీసులూ అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు సీసీ కెమెరాల్లో రికా ర్డయిన ఫీడ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నాచర్లు ఉత్తరాదికి చెందిన వారుగా తేలడంతో తమ పరిధిల్లోని లాడ్జీల్లో ఆరా తీయగా... కాచిగూడలోని ఓ లాడ్జీలో వీరి వివరాలు దొరికాయి. లాడ్జి యజమానికి డబ్బు చెల్లించేందుకు ప్రణీత్‌ తన గూగుల్‌ పే యాప్‌ను వాడటంతో అడ్డంగా దొరికిపోయాడు. దుండగుల కోసం ఉత్తరాదిలో గాలించిన పోలీసులకు నిరాశే ఎదురైంది. అయితే మళ్లీ నేరాలు చేసేందుకు వీరు నగరానికి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భవానీనగర్‌ పరిధిలో ఇద్దరు స్నాచర్లు పల్సర్‌పై తిరుగుతూ పోలీసులకు చిక్కడంతో వారిద్వారా లాడ్జిలో ఉన్న ప్రణీత్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. వాహనాలతో పాటుగా చోరీ ప్రయ త్నంలో ఎవరైనా అడ్డుకుంటే అంతం చేయడానికి ఉంచుకున్న ఓ కత్తినీ ఛోకా నుంచి స్వాధీనం చేసు కున్నారు. వీరికి బైక్‌ అద్దెకు ఇచ్చిన సోఫియాన్‌ పైనా విచారణకు నిర్ణయించారు. వీరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని అధికారులు యోచిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్నాచర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రాచకొండ అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement