సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య

Suicide of a young man - Sakshi

హైదరాబాద్‌: ‘బతకాలని లేదు.. ఉండలేకపోతున్నా.. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష.. ఏమీ సాధించలేకపోయా.. నాకు జీవితం మీద విరక్తి వచ్చింది.. అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోకిలారం గ్రామానికి చెందిన బత్కుల సాయికుమార్‌ (21) గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పంజాల అనిల్‌కుమార్‌ కాలనీలో రూమ్‌ అద్దెకు తీసుకుని స్నేహితులతో కలసి ఉంటున్నాడు.

రిలయన్స్‌లో మార్కెట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్యూకు వెళ్లి వచ్చాడు. సెలెక్ట్‌ కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి పది గంటలకు బయటి నుంచి ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోను పోలీసులు గుర్తించారు.

తొలుత ఆత్మహత్యాయత్నం.. విరమణ
‘బతకాలని లేదు.. ఉండలేక పోతున్నా,,,, అందరినీ మిస్‌ అవుతున్నా.. నాలా ఎవరూ చేయకండి..’అంటూ ఆ సెల్ఫీ వీడియోలో ఉంది. సెల్‌ఫోన్‌ ఆన్‌ చేసి పెట్టి కుర్చీ ఎక్కి మెడకు ఉరి బిగించుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ.. ధైర్యం సరిపోక మెడకు ఉన్న క్లాత్‌ను తొలగించి కిందికి దిగినట్టు సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. చావాలని ఉంది... కానీ ధైర్యం సరిపోవడం లేదంటూ వీడియోలో రికార్డై ఉంది.

అయితే ఆత్మహత్య చేసుకున్నప్పటి వీడియో మాత్రం లభించలేదు. మొదట తన ప్రయత్నాన్ని విరమించుకుని, కొద్దిసేపటి తరువాత ఉరేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామసూర్యన్‌ తెలిపారు.  సాయికుమార్‌ మృతికి రూమ్‌మేట్స్, స్నేహితులు కారణం అయి ఉండవచ్చని మృతుడి సోదరుడు సుధీర్‌ పోలీసులకు తెలిపాడు.
మృతుడి తల్లిదండ్రులు, సోదరిది కూడా బలవన్మరణమే..
సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సాయికుమార్‌ కుటుంబంలో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల క్రితం సాయికుమార్‌ తండ్రి ఆత్మహత్య చేసుకోగా తల్లి, సోదరి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. జీవితంపై విరక్తి చెందే సాయికుమార్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top