ఆత్మహత్య చేసుకోబోతున్నా..సెల్ఫీ వీడియో

Suicide Attempt Video Group Upload In Warangal - Sakshi

ధర్మసాగర్‌(స్టేషన్‌ఘన్‌పూర్‌): తనపై సీఐ చేయి చేసుకున్నందున మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేయడం శనివారం కలకలం సృష్టించింది. కొన్ని గంటలపాటు ఉత్కంఠకు దారితీయగా చివరకు ఆ యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన యువకుడు జక్కుల సుధీర్‌కు, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డికి మధ్య కొన్నేళ్లుగా ఓ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో జూన్‌ 30న సుధీర్‌పై దాడి జరగ్గా, ప్రతిగా అతడి వర్గీయులు జూలై 1వ తేదీన నారాయణగిరి గ్రామంలో ఉన్న ఎంపీపీ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 6 గంటలకు తనను సీఐ డి.శ్రీలక్ష్మి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొట్టిందని, సమాజంలో చట్టాలను గౌవించే వారికి న్యాయం జరగదని, తన చావుకు సీఐ, ఏసీపీ, ఎంపీపీ భర్త రమణారెడ్డి కారకులు అంటూ 5.10నిమిషాలు, ఒక్క నిమిషం వ్యవధి ఉన్న రెండు వీడియోలను గుర్తుతెలియని ప్రాంతంలో రైల్వేట్రాక్‌పై సెల్ఫీ వీడియో తీసి తానే అడ్మిన్‌గా ఉన్న వాట్సప్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అనంతరం గంట తర్వాత సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు.

వీడియో చూసిన గ్రూప్‌ సభ్యులు ఇతర గ్రూపులకు షేర్‌ చేయగా సర్వత్రా కలకలం రేగింది. సుధీర్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు 100కు డయల్‌ చేసి చెప్పి, జీఆర్పీ పోలీసులకు సంప్రదించారు. చివరకు ఉదయం 10గంటల సమయంలో జమ్మికుంట మండలం మడిపల్లిలోని కొడమల్ల సదయ్య ఇంట్లో అతడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తండ్రి వెంకట్రాజంకు అప్పగించారు. కాగా మూడు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఘటనలో ఆ యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇలా చేయడం సరికాదు...
యువకుడి ఆత్మహత్యా బెదిరింపు వీడియో కలకలం రేపిన నేపథ్యంలో డీసీపీ వెంకట్‌రెడ్డి ధర్మసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విచారణ సమయంలో బాధితులు పోలీసులకు సహకరించాలని, అన్యాయం జరిగినట్లు భావిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. సుధీర్‌ను జమ్మికుంట మండలం మడిపల్లిలోని అతడి బాబాయి సదయ్య ఇంట్లో గుర్తించి పలువురు గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి తండ్రికి అప్పగించామని చెప్పారు. కేసు విచారణలో ఉండగా ఇలాంటి వీడియోలు తీసి వాట్సప్‌లో పెట్టడం సరికాదని అన్నారు.

సీఐ కొట్టడంతోనే మనస్తాపం చెందా...
ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు రావాలని శుక్రవారం ఉదయం ఓ కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి చెప్పగా వెళ్లాను. రమణారెడ్డితో జరిగిన గొడవ విషయంలో ఒప్పంద పత్రాన్ని తాను చింపేసినట్లు సంతకం పెట్టాలని, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌లో పెట్టిన కేసును వాపస్‌ తీసుకోవాలని సీఐ మేడం నన్ను తీవ్రంగా ఒత్తిడి చేసింది. మా పెద్దమనుషులతో మాట్లాడిన తర్వాత సంతకం పెడతానని నేను చెప్పాను. దీంతో సీఐ మేడం నన్ను తీవ్రంగా కొట్టింది. మేడం కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందామని సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌లో పెట్టాను. ట్రైన్‌ ట్రాక్‌పై ఉన్న నన్ను జాగింగ్‌కు వచ్చిన వాళ్లు గుర్తించి తీసుకెళ్లి ఊర్లో వదిలారు. అక్కడి నుంచి మా బాబాయి ఇంటికి వెళ్లాను. మనస్తాపంతోనే ఈవిధంగా చేశాను. – జక్కుల సుధీర్, బాధితుడు

సుధీర్‌ను కొట్టలేదు..
గతంలో ఉన్న కేసు విషయంపై సుధీర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి పంపించా. అతడిపై ఎవరూ చేయి చేసుకోలేదు. సుధీర్‌ ఆరోపిస్తున్న హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కేసు విషయంలో మేము వివరణ ఇచ్చుకుంటాం. కేసు వాపస్‌ తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్న ఆరోపణ పూర్తిగా అవాస్తవం. – డి.శ్రీలక్ష్మి, ధర్మసార్‌ సీఐ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top