ప్రేమికులే వాడి టార్గెట్‌ | Sakshi
Sakshi News home page

ప్రేమికులే వాడి టార్గెట్‌

Published Wed, Feb 27 2019 6:49 AM

Sri Dharani Murder Case Police Arrest Accused in West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: ప్రేమికులే వాడి టార్గెట్‌.. ప్రేమ జంటలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దలా వాలిపోతాడు. వాళ్లని బెదిరించి డబ్బులు గుంజుతాడు. అంతటితో ఆగకుండా ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది యువతుల జీవితాలతో ఆ వేటగాడు చెలగాటమాడాడు. కానీ ఆ ఘటనలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. అయితే తాజాగా  కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద జరిగిన తెర్రి శ్రీధరణి(18) హత్యోదంతంతో ఆ వేటగాడి బండారం బట్టబయలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం అర్జావారిగూడేనికి చెందిన దౌలూరి నవీన్, ఎంఎం పురం గ్రామానికి చెందిన తెర్రి శ్రీధరణి  కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈనెల 24న ఉదయం 11.30 గంటలకు వారిద్దరూ గుంటుపల్లి బౌద్ధారామాలను సందర్శించేందుకు వెళ్లారు. భీముడి పాదాల సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉన్న వారు, అటుగా వచ్చిన కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు  కంట పడ్డారు. అంతే మానవ మృగంలా మారిన రాజు నవీన్‌పై దుడ్డు కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం శ్రీధరణిని హత్య చేశాడు. అయితే ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని ఘటనా స్థలాన్ని చూసి అంతా భావిస్తున్నారు.  అసలు విషయాలు పోస్టుమార్టం రిపోర్టులోవెల్లడవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న నవీన్‌ కూడా మృతి చెంది ఉంటాడని భావించిన రాజు ఘటనా స్థలంలో పడి ఉన్న శ్రీధరణి ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.

తీవ్ర గాయాలపాలైన నవీన్‌ ,శ్రీధరణి
ప్రేమికులపై నిఘా
ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తె గంగమ్మను పొట్లూరు రాజు కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు సంతానం. ఇదిలా ఉంటే నెల రోజులుగా రాజు జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. ప్రతి రోజు చుట్టు పక్కల ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి పిట్టలు, అడవి పందులను వేటాడుతున్నాడు. ప్రతి ఆదివారం జీలకర్ర గూడెంకు వెళ్లి ప్రేమికులపై నిఘా పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న ఆదివారం రాజు జీలకర్ర గూడెం బౌద్ధారామాల వద్దకు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పట్టించిన సెల్‌ ఫోన్‌
శ్రీధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయిన రాజు, నేరుగా జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్‌లోని సిమ్‌ కార్డును తీసి పడేసి, తన సిమ్‌ కార్డును వేసి ఫోన్‌ను వాడటం మొదలు పెట్టాడు. ఆ ఫోన్‌ను అమ్ముతానంటూ  ఒక సెల్‌ షాపు వద్దకు వెళ్లగా, వ్యాపారి ఫోన్‌ కొనేందుకు నిరాకరించాడు. ఇదిలా ఉంటే శ్రీధరణి హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా సోమవారం రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాంతో విషయాలన్నీ బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాజు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా..? లేక అతనికి ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే నవీన్‌ సెల్‌ ఫోన్‌ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకరిపై ఒకరు ఆరోపణలు
శ్రీధరణి, నవీన్‌ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో నిజమెంత అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నవీన్‌ నోరు విప్పితే మరిన్ని విషయాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఏది ఏమైనా శ్రీధరణి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు ఈకేసును 24 గంటల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement