మాట్లాడితే రూ.1500 జరిమానా

Speech Penalty Implemented In Sircilla For Community Disputes - Sakshi

మళ్లీ అలాగే చేస్తే రూ.10 వేలు  

సమస్య పరిష్కరించాలంటే రూ.10 లక్షల డిపాజిట్‌  

పోత్గల్‌లో కోరలు విప్పిన సంఘ బహిష్కరణ తీరు  

సంఘంలోకి రానిచ్చేది లేదు.. మాట్లాడేది లేదు 

సాక్షి, సిరిసిల్ల: అందరూ కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితులు పోయి మాకు మేము.. మీకు మీరన్న చందంగా ఒకే కులంలోని వాళ్లే రెండు గా విడిపోతున్నారు. అంతేకాదు ఇలా విడిపోయిన వాళ్లు గ్రూపులుగా మారి ఒక గ్రూప్‌ వాళ్లు ఇంకో గ్రూప్‌లో వాళ్లతో మాట్లాడితే చాలు జరిమానా చెల్లించాల్సిన దుస్థితి నెల కొంది. నిబంధనలను అతిక్రమించి ఒకసారి మాట్లాడితే రూ.500 నుంచి 1500 జరిమానా. మళ్లీ అదే పనిగా రెండోసారి మాట్లాడితే ఇక ఏకంగా రూ.10 వేల జరిమానా చెల్లించాలి.

ఈ వివాదం ఇప్పటిది కాదట 2016లో ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లను కొట్టిన వ్యవహారంలో పెద్దలకు, చెట్టుకొట్టిన వ్యక్తిని నిలదీయడంలో చెలరేగిన సంఘంలోని సంఘర్షణ నేటికీ చల్లారడం లేదు. ఒక కూతురు గర్భసంచి ఆపరేషన్‌ జరిగితే ఆమెను చూడడానికి వెళ్లిన తల్లికి జరిమానా వేసే స్థాయికి చేరింది. ఇలాంటి జరిమానా మేము భరించలేమని ఆ ఊరిలో బాధితులుగా ఉన్న కొందరు ఆదివారం సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. డీఎస్పీ లేకపోవడంతో దీనిపై ఇక ఈ నెల 24న జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖీలోనే తమ గోడు వెల్లబోస్తామని ఆవేదనతో వెనుదిరిగారు.

కులంలో కలహాలకు మూలమిదీ.. 
రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్‌ మండలం పొతుగల్‌లో 2016లో వరద కారణంగా చెరువు కట్ట తెగింది. ఈ క్రమంలో అక్కడ చెట్లు ఓ వ్యక్తి కొట్టుకోవడం చూసిన కొందరు ఒక వర్గానికి చెందిన కులస్తులు అవి అందరికీ చెందినవని దానిని ఒక వ్యక్తి ఎలా కొట్టుకెళ్తాడన్న విమర్శలు చేశారు. దీంతో  సంఘంలో పెద్దమనిషి జంగం బూమ్‌రాపుకు, కులస్తులు కలిసి అతనిని అందరి సమక్షలో చెట్లను కొట్టిన విషయమై ప్రశ్నించారు. ఇదే క్రమంలో కులంలో సదరు వ్యక్తి దురుసుగా, దుర్భాషలాడడంతోపాటు పెద్దమనిషిని కొట్టేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో పెద్దమనిషి అతనిపై రాయిని విసిరినట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. దీం తో భూంరాజుపై కేసు నమోదు జరిగి నేటికీ కోర్టుకు హాజరవుతున్నట్లు కులస్తులు తెలి పారు. ఇదే విషయాన్ని మనసుల్లో పెట్టుకున్న కొందరు కులపెద్దగా ఉన్న అతనిపై వారి సన్నిహితులతో ఎవరూ సుఖ సంతోషాలతో పాలుపంచుకోకూడదని అదే కులంలోని కొందరు హెచ్చరించినట్లు ఆవేదనగా ప్రస్తుతం బహిష్కరణ, జరిమానా చెల్లించిన కుటుంబీకులు వెల్లడిస్తున్నారు.

భార్యను చూడ్డానికి వస్తే జరిమానా  
నా భార్యకు ఇటీవల గర్భసంచి ఆపరేషన్‌ జరిగింది. ఈ విషయం తెలిసి నా అత్తవాళ్లు వస్తే వాళ్లకు సంఘంలో జరిమానా వేశారు. దీంతో ఇక మా అత్తవాళ్లు రావడం లేదు. నా బిడ్డనే నా భార్యకు సేవలు చేస్తోంది. ఉన్న ఊళ్లో మాకు మా సంఘంలో జరిమానా వేయ డంఏంది. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. – కొప్పు ప్రభాకర్,  బాధిత సంఘ సభ్యుడు, పోత్గల్‌

అల్లుడితో మాట్లాడితే     జరిమానా వేశారు
నాకు అన్నీ మా అల్లుడి వాళ్లే చూసుకుంటరు. నాకు చేయి విరిగితే అన్ని తానై చూసిండు. ఇప్పుడు సంఘం రెండుగా మారడంతో ఒక దానిలో నా చిట్టీ ఉంది. మరో దానిలో అల్లుడు ఉన్నడు. మొన్న మాట్లాడినందుకు నాకు జరిమానా అన్నరు. ఎందుకు కట్టాలి జరిమానా. అందరూ కలిసి ఉండాలనే చెప్పిన.  – యెంకవ్వ, పోత్గల్, ముస్తాబాద్‌  

అధికారులను కలిశాం 
చెట్లు కొట్టిన విషయంలో సంఘంలో అందరి సమక్షంలోనే నేను రాయితో కొట్టిన ఘటనలో నాపై కేసు నడుస్తోంది. నేను చట్టంలో తప్పు తేలితే శిక్ష అనభవిస్తా. నాతోపాటు మరికొంత మందిని సంఘం నుంచి తీసేయడం సరికాదు. అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనిపై ఇప్ప టికే పలుమార్లు పోలీస్‌ అధికారులను కలిశాం. ఎస్పీని కలవాలని ఆలోచనలో ఉన్నాం. – భూంరాజు, సంఘం పెద్ద మనిషి, పోత్గల్‌  

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top