పురుషులే టార్గెట్‌

Smart Phones Snatching Gang Arrest In Hyderabad - Sakshi

ఒంటరిగా ఉన్నవారి సెల్‌ఫోన్ల స్నాచింగ్స్‌

48 గంటల్లో ముఠాను పట్టుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు  

సాక్షి, సిటీబ్యూరో: ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి చైన్‌ స్నాచింగ్స్‌కు పాల్పడే ముఠాలను చూసి ‘స్ఫూర్తి’ పొందాడో ఏమోగానీ అతగాడు ఒంటరి పురుషులను లక్ష్యం చేసుకున్నాడు. రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నవారి నుంచి సెల్‌ఫోన్స్‌ లాక్కుపోవడం మొదలెట్టాడు. బండిపై బయలుదేరితే ఒకేరోజు వరుసపెట్టి నేరాలు చేసేస్తాడు. తనవెంట ఓ అనుచురుడు, తమకు ‘ఎస్కార్ట్‌’గా మరో ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. తొమ్మిది నెలలుగా ఈ నేరాలు చేస్తున్నా ఇప్పటి వరకు  ఫిర్యాదులు లేకపోవడంతో సేఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఎస్సార్‌నగర్‌లో నాలుగు, రాయదుర్గంలో మరో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు.

దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు 48 గంటల్లోనే నిందితుడిని గుర్తించి, ముఠాను పట్టుకున్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి సోమవారం పూర్తి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన వి.నాగరాజు వృత్తిరీత్యా డ్రైవర్‌. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తొమ్మిది నెలల క్రితం నేరబాట పట్టాడు. లంగర్‌హౌస్‌ ప్రాంతానికి చెందిన తన స్నేహితులు డి.సునీల్‌ (హౌస్‌కీపర్‌), ఎన్‌.శ్రీనివాస్‌ (క్యాబ్‌ డ్రైవర్‌), ఎన్‌.అజయ్‌కుమార్‌(డీటీహెచ్‌ టీవీ వర్కర్‌)తో  ముఠా ఏర్పాటు చేశాడు. హాస్టల్స్‌ ఎక్కువగా ఉన్న ఎస్సార్‌నగర్, సైఫాబాద్, రాయదుర్గం ప్రాంతాలనే తమ టార్గెట్‌గా చేసుకున్నారు. నాగరాజు, సునీల్‌ ముందు ఓ వాహనంపై వెళ్తుండగా.. శ్రీనివాస్, అజయ్‌లు ఎస్కార్ట్‌గా వెనుక కొద్దిదూరం నుంచి మరో వాహనంపై అనుసరిస్తారు.

ప్రధానంగా రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల వద్ద ఒంటరిగా కనిపించిన వారిని వీరు టార్గెట్‌గా చేసుకుంటారు. నాగరాజు, సునీల్‌ వాహనంపై దగ్గరకు వచ్చి వారి చేతిలో ఉన్న, మాట్లాడుతున్న, చాటింగ్‌ చేస్తున్న సెల్‌ఫోన్లను అమాంతం లాక్కుపోతారు. ఒక్కోసారి సమీపంలో వాహనం ఆపి బెదిరించి మరీ తీసుకువెళ్తారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ ఎవరైనా పట్టుకోవాలని చూసినా, ఏదైనా ఇబ్బంది ఎదురైనా వెనుక ఉన్న ఇద్దరూ వచ్చి అందరినీ బెదిరించి పారిపోవడానికి సహకరిస్తాడు. ఇలా లాక్కుపోయిన వాటిని వీరు మద్యం దుకాణాలు, మార్కెట్స్‌లో సగం కంటే తక్కువ ధరకు విక్రయించి ఆ డబ్బును పంచుకుంటారు. తొమ్మిది నెలలుగా వీరు 50కి పైగా సెల్‌ఫోన్లను ఎత్తుకుపోయారు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వీరిపై పోలీసుల దృష్టి పడలేదు. ఈ నెల 21న సైఫాబాద్‌లో ఓ నేరం చేశారు. ఆపై శుక్రవారం రాత్రి ఎస్సార్‌నగర్‌లో నాలుగు, గచ్చిబౌలిలో మరో స్మార్ట్‌ఫోన్‌ స్నాచింగ్‌చేశారు.

గచ్చిబౌలిలో స్థానికులు మొదటి ఇద్దరినీ పట్టుకోవడానికి ప్రయత్నించగా వెనుక వచ్చిన మరో ఇద్దరు వారిని బెదిరించి అంతా కలిసి ఉడాయించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ నేతృత్వంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.అజయ్‌కుమార్‌ తన బృందాలతో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు. నలుగురినీ పట్టుకుని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top