ఒంటరి మహిళలే అతని టార్గెట్‌ | Single Womens Are Target For Auto Driver In Sattenapalli | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే అతని టార్గెట్‌

Jul 12 2019 10:08 AM | Updated on Jul 12 2019 10:08 AM

Single Womens Are Target For Auto Driver In Sattenapalli - Sakshi

ఆటో డ్రైవర్‌ రమేష్‌

సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని నమ్మకంగా ఆటోలో ఎక్కించుకొని నిర్జన ప్రదేశంలో వారిని దోచుకోవడంతో పాటు అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని రూరల్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారు అనే వివరాలను సేకరిస్తున్నారు.  

నేరాలకు పాల్పడుతుందిలా...
సత్తెనపల్లి రూరల్‌ మండలం నందిగం గ్రామానికి చెందిన రమేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మహిళల్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతని భార్య దుర్గ, స్నేహితులు పట్టి ఖాశీం, గోపీలతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. రాత్రిపూట సత్తెనపల్లి నుంచి సమీప గ్రామాలకు వెళ్లేందుకు వేచిఉన్న మహిళల్ని ఎంపిక చేసుకుంటారు. ఆమె వద్ద బంగారం వస్తువులు ఉన్నట్లయితే ఇక   ఆటోలో ఎక్కించుకునేందుకు వారి పథకం అమలు చేస్తారు.

ఆటోను రమేష్‌ నడుపుతూ అందులో ప్రయాణికుల మాదిరిగా దుర్గ, ఖాశీంలు ఎక్కి కూర్చుం టారు. నుంచున్న ఆమె చెప్పిన గ్రామానికి తమ ఆటో వెళుతుందని నమ్మించి ఎక్కించుకుంటారు. కొద్ది దూరం వెళ్లాక గోపీ కూడా ఆటు వైపు వెళుతున్నట్లుగా ఆటోలో ఎక్కుతాడు. తర్వాత గ్రామ శివారుకు తీసుకువెళ్లి నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి మూకుమ్మడిగా మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం,డబ్బు దోచుకుంటారు

ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 
అమరావతి నుంచి ఆటోలో గుంటూరుకు వస్తున్న నలుగురు నిందితులు ఈనెల 2వ తేదీ రాత్రి 14వ మైలు వద్ద వేచిఉన్న ఓ మహిళను నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. తాడికొండ అడ్డరోడ్డు సమీపంలోని నిర్జన ప్రాంతంలో ఆటోను నిలిపి ఆమె వద్ద ఉన్న 4 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.400 లాక్కొని,  రమేష్‌ దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళ సమీపంలోని ఓ మిల్లు వద్దకు పరుగులు తీయడంతో వారు ఆటోలో పరారయ్యారు. ఈ మేరకు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

పోలీసుల అదుపులో రమేష్‌ 
రాజధానిలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్బన్, రూరల్‌ ఎస్పీలు సీరియస్‌గా పరిగణించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీఎస్‌ పోలీసులతో కలసి మొత్తం ఏడు ప్రత్యేక బృందాల్ని కేటాయించారు. ఈ క్రమంలో ఈనెల 10న రమేష్, మరో ఇద్దరు యువకులు సత్తెనపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో రమేష్‌ మినహా మిగిలిన ఇద్దరి ప్రమేయం లేదని తేలడంతో వారిని విచారించి వదిలేసినట్లు తెలిసింది.

భర్తకు దోపిడీలు, అత్యాచారాల్లో సహకరిస్తున్న దుర్గ, మిగిలిన ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. రమేష్‌ను పోలీసులు వారిదైన శైలిలో విచారిస్తున్నారు. విచారణలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు ? ఫిర్యాదులు చేసేందుకు ధైర్యం చేయలేని మహిళలను ఎంతమందిని అత్యాచారం చేశారు ? జిల్లాలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు? అనే అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement