మేకల కాపరి దారుణహత్య  

Shepherd Brutally Murdered In Tuggali  - Sakshi

సాక్షి, తుగ్గలి(కర్నూలు) : మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్‌ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్‌ రామునాయక్‌(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట వద్ద భార్య దేవమ్మ తెచ్చిన భోజనాన్ని తిని, తిరిగి మేకలను తోలుకుని వెళ్లాడు.

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య, కుమారులు, తండా వాసులు బోడబండ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనపడలేదు. చీకటి కావడంతో చేసేదేమీ లేదక రాత్రి జొన్నగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారు జామునే మళ్లీ వెతికేందుకు వెళ్లిన తండావాసులకు ఓ గుట్టలో రాళ్ల మధ్య తలపై తీవ్రగాయాలతో విగత జీవిగా పడిఉన్న రామునాయక్‌ మృతదేహం కంట పడింది. మేకలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించక పోవడంతో దొంగల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి చేరే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కట్టెతో తలపై కొట్టి చంపి మేకలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. రూ.2 లక్షలు కూడా చేయని వాటి కోసం ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.  

ఘటనా స్థలాన్నిపరిశీలించిన డోన్‌ డీఎస్పీ.. 
మేకల కాపరి హత్య విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా, పత్తికొండ సీఐ సోమశేఖరరెడ్డి, జొన్నగిరి ఎస్‌ఐ విజయకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మేకల కోసం దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

ఇది రెండో ఘటన..  
ఆరేళ్ల క్రితం మండలంలోని పి.కొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ ఎనుముల పుల్లన్న కుమారుడు సురేంద్ర(12) దారుణ హత్యకు గురయ్యారు. సురేంద్ర పక్క గ్రామంలోని హుసేనాపురానికి గొర్రెల యజమాని వద్ద గొర్రెలు మేపేందుకు జీతం ఉన్నాడు.రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కొండపై గొర్రెలు మేపుతుండగా దొంగలు కాపరి తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసి గొర్రెలు ఎత్తుకెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top