
పశ్చిమ గోదావరి,తణుకు: ఐసోప్రొపిల్ ఆల్కహాల్ తాగిన మరో యువకుడు మృతి చెందాడు. ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన పండూరి వీరేష్ (24) తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మద్యం దొరక్కపోవడంతో తణుకు పట్టణంలోని కెమికల్ షాపు నుంచి ఐసో ప్రొపిల్ ఆల్కహాల్ తెచ్చుకుని ఆరుగురు యువకులు తాగడంతో వారిలో ధర్నాల నవీన్‌మూర్తిరాజు మూడురోజుల క్రితమే మృతి చెందాడు. పండూరి వీరేష్, అల్లాడి వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరేష్ కూడా బుధవారం మృతి చెందాడు. వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరితో పాటు తక్కువ మోతాదులో రసాయనం తీసుకుని కోలుకున్న తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్‌లను ఇరగవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.