
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కాగావల్లభనేని శ్రీనివాసరావు హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే స్థానిక టీఆర్‌ఎస్ నాయకులతో ఆయనకు గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో టీఆర్‌ఎస్ పేరుతో విజయనగరం జిల్లా బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వల్లభనేని శ్రీనివాసరావు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాగే విద్యావిధానంపై సమూలమైన మార్పులు తీసుకురావాలంటూ వల్లభనేని శ్రీనివాసరావు చాలాకాలం నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన వీసీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.