ఉలిక్కిపడ్డ బెజవాడ..!

Rowdy Sheeter brutal murdered in Bejawada - Sakshi

పట్టపగలు నడిరోడ్డుపై రౌడీషీటర్‌ దారుణహత్య

కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికిన దుండగులు

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్‌పేటకు చెందిన రౌడీషీటర్‌ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్‌ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో బుధవారం దారుణంగా హత్యకు గురయ్యాడు.  సినీఫక్కీలో వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో హత్య చేసి పరారయ్యారు. ఆరుగురు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో సుబ్బును నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు.  జన సంచారం రద్దీగా ఉండే ఏలూరు రోడ్డుకు సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. టీడీపీ యూత్‌ విభాగం నగర అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను తన భర్తను హత్య చేయించాడని మృతుడి భార్య దుర్గ, ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు.

సాక్షి, విజయవాడ/గుణదల: విజయవాడ నగరం మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్‌లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్‌ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి నాజర్‌పేటకు చెందిన వేమూరి సుబ్రహ్మణ్యం(35)అలియాస్‌ సుబ్బు కొద్దికాలంగా విజయవాడ రాజరాజేశ్వరీపేటలో కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు. అతను భార్య దుర్గ, కుమారుడు తేజ (17), మనోజ్‌ (14)తో కలిసి నివసిస్తున్నాడు. 

గతంలో సుబ్బు టీడీపీ యువజన నాయకుడు కాట్రగడ్డ శ్రీను వద్ద పనిచేసేవాడు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్, కాల్‌మనీ వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. సుబ్బు ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. మాచవరం ఏరియాలోకి రాగానే మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు సుబ్బుపై దాడిచేశారు. వెంట తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లతో విచ్చణారహితంగా నరికారు. ఎడమ భుజం పూర్తిగా ఛిద్రమై ఎముకలు బయటపడ్డాయి. అకస్మాతుగా చోటుచేసుకున్న సంఘటనతో ఉలిక్కిపడ్డ జనం తేరుకుని భయంతో పరుగులు తీశారు. నిందితులు బైక్‌లపై పరారయ్యారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీం వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. 

పట్టుబడ్డ ఇద్దరు నిందితులు
సుబ్బును హత్య చేసిన హంతకులలో ఇద్దరు పట్టుబడ్డారు. హత్య విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తెనాలికి చెందిన వారు కావడంతో అక్కడి వారితో కూడా సుబ్బుకు విభేదాలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
కుటుంబసభ్యులను అడ్డుకున్న పోలీసులు

సుబ్బు హత్య విషయం తెలియడంతో కుటుంబసభ్యులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న సుబ్బును చూసిన భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం వద్దకు వెళ్లకుండా కొద్దిసేపు నియంత్రించడంతో భార్య దుర్గ, తండ్రి వెంకటేశ్వర్లు బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై నరికి చంపిన వారని ఆపకుండా తమను ఆపుతున్నారేమని ప్రశ్నించారు. క్లూస్‌ టీం రానిదే ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో దూరంగా నిలబడిపోయారు.

శ్రీనే హత్య చేయించాడు.. 
కాట్రగడ్డ శ్రీను నివాసం కూడా సంఘటనా స్థలానికి అతి సమీపంలో ఉండటంతో అతనే ఈ హత్య చేయించాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. గతంలో శ్రీను వద్ద సుబ్బు పనిచేశాడని, ప్రస్తుతం మానేయడంతో మరో వర్గంతో చేతులు కలిపి ఈ హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్నాం..డీసీపీ  
ఈ హత్యకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ గజరావుభూపాల్‌ సంఘటన స్థలం వద్ద విలేకరులకు చెప్పారు. రెండేళ్ల కిందట సుబ్బు అన్నయ్య సత్యనారాయణ కూడా హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. అప్పటి నుంచి సుబ్బుకు శత్రువులు ఉండి ఉంటారని తెలిపారు. సుబ్బుకు సంబంధించిన అన్ని వివరాలు తెనాలిలో ఉంటాయని అక్కడి పోలీసులతో సంప్రదించి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మాచవరం పోలీసులను టీంలుగా విభజించి తెనాలి ప్రాంతానికి పంపించామని వివరించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లు సేకరించిన వివారాలు, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నా భర్తను పొట్టన పెట్టుకున్నారు..
నా భర్తను చంపేశారు. నా కుంటుంబం రోడ్డున పడింది. పగ తీరకపోతే మమ్మల్ని కూడా పొట్టన పెట్టుకోండి. పొట్ట తిప్పల కోసం విజయవాడ వస్తే నా భర్తను పొట్టన పెట్టుకున్నారు. నడిరోడ్డుపై నరికి చంపారు. ఇదెక్కడి ఘోరం.
దుర్గ(సుబ్బు భార్య)

నా బిడ్డను శ్రీనే చంపాడు..
నా బిడ్డను చంపింది కాట్రగడ్డ శ్రీనునే. లేకపోతే గవర్నర్‌ పేట వెళతానని చెప్పిన నా బిడ్డ మాచవరం డౌన్‌కు వెళ్లి హత్యకు గురికావడమేంటి. కాట్రగడ్డ శ్రీను ఇంటికి సమీపంలో ఈ హత్య పథకం ప్రకారమే జరిగింది. 
వెంకటేశ్వర్లు(సుబ్బు తండ్రి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top