
గూడూరు రూరల్: పట్టణంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్ రహీద్(35) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, రషీద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రషీద్ హత్య వెనుక లేడీ డాన్ వందన ప్రమేయం ఉన్నట్లు సమాచారం. టిడ్కో గృహాల కాలనీలో వ్యభిచారం, గంజాయి, సెటిల్‌మెంట్‌తో లేడీ డాన్‌గా వందన ఎదిగింది. వందన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడంతో రషీద్ హత్యకు గురైనట్లు సమాచారం. లేడీ డాన్ వందనతో పాటు ఆమె అనుచరులు వెంకీ, హన్షిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
