శివారు.. జనం బెంబేలు | Robberies in Kurnool City Outcuts | Sakshi
Sakshi News home page

శివారు.. జనం బెంబేలు

Jan 7 2020 12:35 PM | Updated on Jan 7 2020 12:35 PM

Robberies in Kurnool City Outcuts - Sakshi

గార్గేయపురంలోని ఓ ఇంట్లో బీరువాలోని సేఫ్‌ లాకర్‌ను ఇనుప రాడ్లతో వంచిన దృశ్యం

కర్నూలు శివారు ప్రాంత ప్రజలు దొంగల భయంతో వణికిపోతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళితే తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. గార్గేయపురంలో శనివారం రాత్రి ఆరు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించిన విషయం విదితమే. అది కూడా తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే టార్గెట్‌ చేసి..కట్టర్‌తో తాళాలను తెగ్గొట్టి డబ్బు, ఆభరణాలు తస్కరించారు. ఈ చోరీల    నేపథ్యంలో శివారు ప్రాంత ప్రజల ఆందోళన రెట్టింపవుతోంది.

కర్నూలు రూరల్‌ : కర్నూలు నగరం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాలు, పది దాకా వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రాత్రిపూట పోలీసుల గస్తీ నామమాత్రంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో అసలే ఉండడం లేదు. రాత్రి వేళల్లో గ్రామానికి ఒక పోలీసును డ్యూటీ వేస్తున్నప్పటికీ వారు ఎక్కడా కన్పించడం లేదు. చాలా ప్రాంతాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఈ పరిస్థితిని దొంగలు అనువుగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగలు పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో శివారు ప్రాంతాలనే టార్గెట్‌ చేస్తున్నారు. బిహార్, చెడ్డీ, రాజస్థాన్‌ గ్యాంగ్‌లు చోరీలకు తెగబడుతున్నాయన్న ప్రచారంతో ప్రజలు వణికిపోతున్నారు. గార్గేయపురంలో జరిగిన చోరీలతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న దిగువపాడు, శివరామపురం, నందనపల్లి, మిలిటరీకాలనీ, కేతవరం తదితర గ్రామాల ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గ్రామాలు కర్నూలు–గుంటూరు మార్గంలో ఉండడంతో దొంగలు సులువుగా చోరీలకు తెగబడుతున్నారు. 10 మంది దాకా వాహనంలో వచ్చి, రోడ్డుపైనే ఆపి తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడుతున్నారు. గార్గేయపురంలో ఇదే తరహాలో చోరీలకు తెగించారు. గతంలో వెంకాయపల్లి, దిన్నెదేవరపాడు, బి.తాండ్రపాడు గ్రా మాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.

వారం ముందే రెక్కీ?
దొంగలు చోరీలకు పాల్పడడానికి వారం ముందే రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పగలు దుప్పట్లు, దుస్తులు అమ్మేవారి లాగా వస్తున్నారు. అనువైన ఇళ్లను గుర్తించి.. రాత్రిపూట చోరీలకు తెగబడుతున్నారు. ఇళ్లకు వేసిన తాళాలను కట్టర్‌ సహాయంతో ఏమాత్రమూ శబ్దం రాకుండా తెగ్గొడుతున్నారు. తర్వాత తమ వెంట తెచ్చుకున్న దుప్పటిని డోర్‌కు అడ్డంగా కట్టి..నగదు, నగలు మూటగట్టుకుంటున్నారు. దీనివల్ల ఆ ఇంట్లో ఏమి జరుగుతోందో  బయటివారు గుర్తించలేని పరిస్థితి. గార్గేయపురంలో చోరీలకు పాల్పడిన దొంగలు కాసేపు సెంటర్‌లో కూర్చుని వెళ్లినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మోకాళ్ల వరకు బురఖా, కాళ్లకు చెడ్డీలు వేసుకుని వచ్చారని, తమ వెంట తెచ్చుకున్న వాహనాన్ని గ్రామమంతా తిప్పారని జనం చెబుతున్నారు.  

తాళం కట్‌ చేశారు
మేము శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లాం. శనివారం రాత్రి చోరీ జరిగింది.  తాళాన్ని కట్టర్‌ సహాయంతో కట్‌ చేశారు. ఒకవేళ ఆ సమయంలో మేము ఇంట్లో ఉంటే మా ప్రాణాలు కూడా తీసేవారేమో!  – మల్లికార్జున, గార్గేయపురం 

చిన్న శబ్దం కూడా రాలేదు
నేను పక్కనే ఉన్న మా అమ్మ వాళ్లింట్లో పడుకున్నా. మా ఇంట్లో దొంగలు పడి రూ.30వేల నగదు, మూడు తులాల బంగారు ఎత్తుకెళ్లారు. ఆ రాత్రి మా ఇంట్లో నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. తాళం, బీరువా పగులగొట్టినా శబ్దం రాకుండా దొంగతనం చేశారు.            – కురువ మాధవి, గార్గేయపురం 

త్వరలోనే పట్టుకుంటాం
గార్గేయపురంలో చోరీలపై విచారణ చేస్తున్నాం. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం.– ఓబులేసు, సీఐ, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement