రోడ్లపై నెత్తుటి ధారలు

Road Accident In Nagar Kurnool - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం నిద్ర, మద్యంమత్తులో వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే. తాజాగా జిల్లాలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందగా నాగర్‌కర్నూల్‌ మండలం పెద్దముద్దునూరుకు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృత్యువాత పడింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.   

నాగర్‌కర్నూల్‌ : మండలంలోని పెద్దముద్దునూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లికి చెందిన రాములు తన టాటాఎస్‌ ఆటోలో 14 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నాగర్‌కర్నూల్‌కు బయల్దేరారు. పెద్దముద్దునూరు గ్రామ సమీపంలోకి రాగానే కొల్లాపూర్‌ నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడి ఓ గుర్తుతెలియని మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి, పెద్దకొత్తపల్లికి చెందిన ముత్యాలమ్మ, యాదిరెడిపల్లికి చెందిన బాలయ్య, పెద్దకొత్తపల్లికి చెందిన రాములు, పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లపల్లికి చెందిన సాయిబాబకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు, స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురిలో ఉంచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలాఉండగా లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. 

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. 

ఉప్పునుంతల (అచ్చంపేట): దైవదర్శనానికి వెళ్లివస్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన శ్రీశైలం–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న  ఈరట్వానిపల్లి స్టేజీ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..  హైదరాబాద్‌కు చెందిన వీరేశం, కొండలు, మహేష్, ప్రణయ్‌లు డిగ్రీలో స్నేహితులు. ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేట్‌ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరూ శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడానికి శుక్రవారం రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. శనివారం సాయం త్రం తిరుగు ప్రయాణమవ్వగా రాత్రి 11 గంటల సమయంలో మండలంలోని ఈరట్వానిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే డిండి వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు, వీరి బైక్‌ ఎదురుపడి ఢీకొన్నాయి.

దీంతో మహేష్‌ (24), ప్రణయ్‌ (23)లకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే చనిపోయారు. మరో బైక్‌పై ఉన్న వీరేషం, కొండలు ఈ విషయాన్ని ఫోన్‌చేసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్‌ఐ విష్టు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు మహేష్‌ హయత్‌నగర్‌లో ఉంటున్న ఉపాధ్యాయుడు శంకరయ్య, అనితల పెద్దకుమారుడు. మరో మృతుడు ప్రణయ్‌ సైదాబాద్‌లో ఉంటూ ముత్యాల వ్యాపారం చేసుకుంటూ జీనవం గడిపే యదగిరి, పద్మల రెండో కుమారుడు. ఆదివారం మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top