నెత్తురోడిన రహదారులు

సంఘటన స్థలంలో రమేష్‌ మృతదేహం  కొండయ్య (ఫైల్‌) - Sakshi

మక్తల్‌/అలంపూర్‌: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోజు ఏదో ఒక రూట్లో ప్ర మాదం చోటుచేసుకుంటూనే ఉంది. కారణం ఏదైనా.. నిర్లక్ష్యం ఎవరిదైనా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మక్తల్, అలంపూర్‌ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు బలైపోయారు. 

బస్సు ఢీకొన్న సంఘటనలో..  
ఊట్కూర్‌కు చెందిన రమేష్‌ (45) మక్తల్‌లో జరుగుతున్న పడమటి ఆంజనేయస్వామి జాతరకు తన భార్యాపిల్లలతో వచ్చాడు. అలాగే అతని తోడల్లుడు దాసర్‌పల్లికి చెందిన కొండయ్య (40) కూడా జాతరకు వచ్చాడు. భార్యాపిల్లలను ఇంట్లో వదిలిపెట్టి వారిద్దరు కలిసి ఆదివారం బైకుపై పనిపై దండు గ్రామానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి మక్తల్‌కు వస్తుండగా పెద్ద చెరువు సమీపంలోకి రాగానే మక్తల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో రమేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా కొండయ్యకు సైతం బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కొండయ్యను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి చనిపోయాడు.

మిన్నంటిన రోదనలు 
తోడళ్లుల్లు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు సంఘటనను జీర్ణించుకోలేకపోయారు. సంఘటన స్థలంలో, ఆస్పత్రి వద్ద గుండెలు బాదుకుంటూ విలపించారు. ఈ సంఘటనతో ఊట్కూర్, దాసర్లపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రమేష్‌కు భార్యతోపాటు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. ఊట్కూర్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఓ హోటల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు.

కొండయ్య వ్యవసాయం చేసుకుంటూనే ఓ చానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. జాతరకోసం అత్తారింటికి వచ్చిన అల్లుళ్లు అకాల మరణం పొందడం, పెద్దదిక్కు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ సంఘటనపై ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. 

గుర్తుతెలియని వాహనం ఢీకొని..

అలంపూర్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉండవల్లి మం డలం అలంపూర్‌ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాలిలా.. అలంపూర్‌ మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన మహేష్‌ (44) ఓ గోదాంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే ఆదివారం విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బైక్‌పై వస్తుండగా అలంపూర్‌ చౌరస్తాలోని అలంపూర్‌ రోడ్డు మార్గంలో ఉన్న రైస్‌మిల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

దీంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఇదిలాఉండగా మహేష్‌ గతంలో గ్రా మ ఉప సర్పంచ్‌గా సేవలందించి అందరి మన్ననలు పొందాడు. అతని మరణ వార్త విని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ సిబ్బందితో వచ్చి పంచనామా నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఇదిలాఉండగా మృతుడికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
వెల్దండ (కల్వకుర్తి): మండలంలోని ఏవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. గుండాల గ్రామానికి చెందిన ఏనుముల తిర్పతయ్య, కల్వకుర్తి మండలం వేపూర్‌ గ్రామానికి అందె శేఖర్‌ ద్విచక్ర వాహనంపై గుండాల నుంచి కల్వకుర్తి వైపు బయల్దేరారు. ఫంక్షన్‌హాల్‌ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం డీకొట్టి వెళ్లిపోయింది.

స్థానికులు గుర్తించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top