బావను కొట్టి చంపిన బావమరిది | Relative Murdered in East Godavari | Sakshi
Sakshi News home page

బావను కొట్టి చంపిన బావమరిది

Jan 18 2019 7:56 AM | Updated on Jan 18 2019 7:56 AM

Relative Murdered in East Godavari - Sakshi

మృతుడు శ్రీను(ఫైల్‌), దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

తూర్పుగోదావరి,గొల్లప్రోలు (పిఠాపురం): మండలంలోని చేబ్రోలులోని ఎస్సీ పేటలో బావను కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి గంగకు చెందుర్తి గ్రామానికి చెందిన ఆరుగుళ్ల శ్రీనివాస్‌(34)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడు నెలలుగా శ్రీనుకు గంగకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో గంగ చేబ్రోలులోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కాగా శ్రీను తన కుమారులను తీసుకుని పండగ సందర్భంగా చేబ్రోలులోని భార్య వద్దకు బుధవారం వచ్చాడు. ఇంటి వద్ద అత్తవారి కుటుంబ సభ్యులకు శ్రీనుకు మధ్య వివాదం చోటు చేసుకుంది.

దీంతో గంగ సోదరుడు (బావమరిది) దొండపాటి చంద్రబాబు మంచం పట్టెతో శ్రీను తల వెనుక బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన శ్రీనును స్థానికులతో పాటు మేనత్త కుటుంబ సభ్యులు కత్తిపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మొదట ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను గురువారం మృతి చెందాడు. తండ్రి చనిపోవడంతో ముగ్గురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌లోని కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. సంఘటనకు దారి దీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. ఎస్సై బి.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement