‘రియల్‌’ వ్యాపారి ఆత్మహత్య

Real estate merchant suicide - Sakshi

పోలీసులతో కలసి వ్యాపారం

ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా తిప్పలు

సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణం

సాక్షి, మహబూబాబాద్‌/నెల్లికుదురు: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లికుదురుకు చెందిన నల్లబెల్లి తిరుమల్‌(45) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ను నిర్వహించేవాడు. అతడి సమీప బంధువైన సీఐ ఎర్ర మోహన్, ఏఎస్సై నిమ్మల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి  కొంతకాలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు.  తొర్రూర్, నర్సింహులపేటలో వెంచర్లు చేశాడు. నర్సింహుల పేటలో ప్లాట్లను అమ్మగా వచ్చిన రూ.3.50 లక్షలు సీఐ మోహన్‌కు ఇచ్చాడు. అంతలోనే సీఐ మోహన్, ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి మధ్య మనస్పర్ధలు వచ్చా యి.

ఈ క్రమంలో ప్లాట్లను ఏఎస్సై తన కుమారుడి పేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. వెంచర్‌లో నష్టం వచ్చినందున మీరే భరించాలని, లేకపోతే ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయనని ఏఎస్సై అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు.  ప్లాట్లను కొనుగోలు చేసిన నర్సింహులపేట మండలం కొమ్ములవంచ తండాకు చెందిన సంతోశ్, మంగ్యా, రంగమ్మ, శిరీష శుక్రవారం ఉదయం తిరుమల్‌ ఇంటికి వచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని గొడవ చేశారు.

మనస్తాపానికి గురైన తిరుమల్‌ తన చావుకు సీఐ మోహన్, ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం ఉరేసుకొన్నాడు. తిరుమల్‌ తన పాఠశాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం విక్రయించి కార్యాలయ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. అందులోనే ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు సీఐ, ఏఎస్సై, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సదరు సీఐ మోహన్‌ ఇటీవలే డీఎస్పీ పదోన్నతి పొంది, హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నట్టు సమాచారం.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top