7లక్షలకు 13 ఏళ్ల కూతురిని అమ్మేశాడు!

Rajasthan Man sold Daughter for Rs 7 lakh - Sakshi

బర్మార్‌: కన్నకూతురిని రూ. 7 లక్షలకు అమ్మేసిన ఓ దుర్మార్గపు తండ్రి ఉదంతమిది. రాజస్థాన్‌ బర్మార్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి చేత అమ్మివేయబడిన 13 ఏళ్ల బాలిక ఎట్టకేలకు హైదరాబాద్‌లో దొరికింది. పోలీసులు బాలికను కనుగొనే సమయానికి.. ఆ చిన్నారి నాలుగు నెలల గర్భవతిగా ఉంది. ఈ ఘటనలో తండ్రితో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  ‘బాలికను కనుగొనడంతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఆమెను బర్మార్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించాం. ఈ నెల 15న బాలికను కోర్టు ముందు ప్రవేశపెడతాం’ అని బర్మార్‌ ఎస్పీ శరద్‌ చౌదరి తెలిపారు. బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా ఉందని సివానా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో దావూద్‌ ఖాన్‌ తెలిపారు.

బాలికను తప్పిపోయినట్టు సివానా పోలీసు స్టేషన్‌లో గత జూన్‌ 30వతేదీన కేసు నమోదైంది. తన అన్న కూతురు జూన్‌ 22వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక బాబాయి కేసు నమోదు చేశారు. ఓ ప్రముఖ కుటుంబంతో పెళ్లి జరిపిస్తానని దళారి గోపా రామ్‌ మాలి తన అన్నకు చెప్పాడని, దీంతో వరుడి కుటుంబంతో మాట్లాడి వస్తానంటూ కూతురిని తీసుకొని తన అన్న సివానాకు వెళ్లాడని, అనంతరం ఆయన తిరిగొచ్చాక కూతుర్ని వెంట తీసుకురాలేదని, బాలిక ఏదని అడిగితే మామయ్య ఇం‍ట్లో వదిలేసి వచ్చానని తన అన్న చెప్పాడని ఆయన ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. జూన్‌ 26వ తేదీన మామయ్య ఇంట్లో కూడా బాలిక లేదని తెలియడంతో బాలిక తండ్రిని ప్రశ్నించగా.. బాలికను ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పాడంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

దీంతో జూలై మొదటివారంలోనే బాలిక తండ్రితోపాటు దళారి గోపరామ్‌ మాలి, బాలికను కొనుగోలు చేసిన సన్వ్లా రామ్‌ దస్పాను పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపారు. బాలికను రూ. 7లక్షలకు అమ్మినందుకు తండ్రిపైన, కొనుగోలు చేసినందుకు నిందితులపైనా అభియోగాలు మోపారు. అయితే, బాలికను మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో బాలిక బాబాయి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 15లోపు బాలికను కనుగొనాలంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో హైదరాబాద్‌లో బాలికను గుర్తించిన రాజస్థాన్‌ పోలీసులు.. బాలికతోపాటు ఉన్న దస్పా కొడుకుపై సెక్షన్‌ 363 (కిడ్నాప్‌), 366 (మహిళను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం), 384 (ఎక్స్‌టార్షన్‌) తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top