గర్భిణి బలవన్మరణం

Pregnent Women Commits Suicide in Hyderabad - Sakshi

అత్తింటివారి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు

జీడిమెట్ల: మొదటి కాన్పులో ఆడపిల్లే పుట్టడంతో పాటు రెండో కాన్పులోను ఆడపిల్లే పుడుతుందని అత్తింటి వారి సూటిపోటి మాటలు భరించలేక ఓ గర్భిణి బలవన్మరణాన్ని పాల్పడింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాజులరామారం డివిజన్‌ వివేకానంద కాలనీకి చెందిన శశిలేఖ కుమారుడు శేరి అనిల్‌రెడ్డి తో అదే ప్రాంతానికి చెందిన ఈదులకంటి మధుసూదన్‌రెడ్డి, వనజల కుమార్తె రేఖ(26)కి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.20 లక్షలు కట్నకానుకల కింద అందజేశారు. అనిల్‌రెడ్డి చింతల్‌లోని శివసాయి కంప్యూటర్స్‌ ఇనిస్టిట్యూషన్‌ నిర్వహిస్తుండగా రేఖ గృహిణి. వీరికి మోక్ష (15 నెలలు)పాప ఉంది.

ప్రస్తుతం రేఖ ఆరు నెలల గర్భిణి. పెళ్‌లైన కొద్ది నెలల వరకు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి ఆడపిల్లే  పుడుతుందని అత్తింటి వారు నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రేఖ తన తల్లికి ఫోన్‌చేసి ఇంట్లో గొడవ జరిగిందని, తనను తీవ్రంగా హింసిస్తున్నారని ఏడుస్తూ ఫోన్‌ పెట్టేసింది. వెంటనే తల్లి వనజ కూతురి ఇంటికి వెళ్లగా ఇంట్లో అందరూ ఉన్నారు. రేఖ గది లోపల నుంచి గడియ పెట్టి ఉండగా స్థానికుల సహాయంతో పగులగొట్టి చూశారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది. భర్త అనీల్‌రెడ్డితో పాటు అత్త శశిలేఖ, ఆడపడుచు వనిత వేధింపుల కారణంగానే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top