కోర్టుకు ప్రణయ్‌ హత్య కేసు నిందితులు 

Pranay murder case accused to Court - Sakshi

14 రోజుల పాటు రిమాండ్‌ 

మిర్యాలగూడ టౌన్‌: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 14వ తేదీన జరిగిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితులను బుధవారం పోలీసులు మిర్యాలగూడలోని అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో తిరునగరు మారుతీరావు, సుభాష్‌శర్మ, అస్గర్‌అలీ, మహ్మద్‌ బారీ, ఎంఏ కరీం, తిరునగరు శ్రవణ్‌కుమార్, శివలపై హత్యా నేరం, కుట్ర వంటి కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి.

వీరిలో ఆరుగురు నిందితులను నల్లగొండ నుంచి మినీ బస్సులో భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ కోర్టుకు తీసుకువచ్చారు. ముందుగా నిందితులకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4.12 గంటలకు డీఎస్‌పీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్‌ శోభారాణి కేసును పరిశీలించి నిందితులను అక్టోబర్‌ 3వ తేదీ వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. కాగా, ప్రణయ్‌ని హత్య చేసిన ఏ–2 నిందితుడు, బిహార్‌కు చెందిన సుభాష్‌శర్మను కోర్టులో హాజరు పరచలేదు.
 
‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ ఫేస్‌బుక్‌ పేజీకి ఆదరణ
ప్రణయ్‌కి న్యాయం జరగాలని ఆయన భార్య అమృత వర్షిణి ఫేస్‌బుక్‌లో పేజీ ఏర్పాటు చేశారు. ప్రణయ్‌ హత్యను ఖండిస్తూ, అమృతకు మద్దతుగా ఇప్పటివరకు 32,752 మంది పేజీని లైక్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top