నిండుప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

సైకిల్‌పై వెళ్తున్నవారిని ఢీకొన్న బైక్‌

క్షగతాత్రుడిని ఆస్పత్రిలో చేర్చి జారుకున్న నిందితుడు

బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమం): ఒకరి నిర్లక్ష్యం మరొకరి కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. తమ ఇంటి దీపం ఆరిపోయిన పలువురి జీవితాలను నిలబెట్టేందుకు అవయవదానం చేసేందుకు పేద కుటుంబం ముందుకొచ్చింది. అయితే ప్రమాదానికి కారణమైన యువకుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిం చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ గొల్లపాలెంగట్టు బావి ప్రాంతంలో కాకి చిరంజీవి(45) భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నారు. చిరంజీవి అల్యూమినియం పాత్రల తయారీ పనిచేస్తారు. వచ్చే అరకొర సంపాదనలోనే కుమార్తెలను చదివిస్తున్నారు. ఈ నెల 18న చిరంజీవి మరో యువకుడితో కలిసి సైకిల్‌పై బంగారయ్య కొట్టు వైపు నుంచి వాగు సెంటర్‌ వైపు వెళ్తుండగా, ఓ యువకుడు డివైడర్‌పై నుంచి బైక్‌ను దూకించి సైకిల్‌ను ఢీకొట్డాడు.

చిరంజీవి, అతనితో ఉన్న వ్యక్తి కూడా గాయపడ్డారు. చిరంజీవి తలకు గాయమై స్పృహకోల్పోవడంతో బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి సమీపంలోని డాక్టర్‌ వద్ద చేర్చి జారుకున్నాడు. ఈ తతంగం అంతా ఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న బ్యాకరీ ఎదుట ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. అనంతరం చిరంజీవిని 108పై ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. విజయవాడలో సరైన వైద్యం అందక గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతని కుటుంబీకులు చిరంజీవి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి గురించి ఆరా తీసేందుకు బాధితుని బంధువులు కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోగా చేదు అనుభవం ఎదురైంది. సీసీ కెమెరాలో బైక్‌ నంబర్‌ సరిగా రికార్డు కాలేదని, కేసు దర్యాప్తులో ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పారని బాధితులు ఆరోపించారు. న్యాయం జరగకుంటే సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top