మింగారు.. దొరికారు...

Police Arrested Sunil Who Committed Corruption In SC Corporation - Sakshi

రూ.60 లక్షల మిస్టరీని ఛేదించిన పోలీసులు

ఎస్సీ కార్పొరేషన్‌లో నిధులు కాజేసిన వ్యక్తుల అరెస్ట్‌ 

 తీగలాగుతున్న పోలీసులు 

ఖమ్మం క్రైం : సంచలనం సృష్టించిన ఎస్సీ కార్పొరేషన్‌ అవకతవకల కేసులో నిందితుడు వేముల సునీల్‌ను పోలీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. రూ.60 లక్షల మేరకు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తమ దర్యాప్తులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ వెంకట్రావు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 26న వి.కృష్ణవేణి, మరో 12 మంది తమకు అందాల్సిన ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను వేముల సునీల్‌ అనే వ్యక్తి తమకు తెలియకుండా తీసుకుని   వాడుకున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ స్పందించి అప్పటి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ప్రభాకర్‌ను పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ప్రభాకర్‌రావు కార్పొరేషన్‌లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి సునీల్‌ అనే వ్యక్తి నగదును తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుని   రూ.60లక్షల నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో అడిషనల్‌ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకట్రావు, సీసీఎస్‌ సీఐ వసంత్‌కుమార్, టూటౌన్‌ సీఐ నరేందర్‌లు  బృందంగా ఏర్పడి ఈ కేసు మిస్టరీని ఛేదించారు. 2015–16 ఏడాదికి గాను ఖమ్మం మున్సిపల్‌ కార్యాలయం నుంచి 264 దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్‌కు పంపారు. అందులో 165 దరఖాస్తులు మాత్రమే మంజూరయ్యాయి. అదేవిధంగా 158 మందికి సంబంధించిన మరో లిస్టు ఎస్సీ కార్పొరేషన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా వెళ్లగా అప్పటి కలెక్టర్‌ దానిని నిలిపివేశారు. 158 మంది లిస్టులో ఉన్న దరఖాస్తుదారుడు  వేముల సునీల్‌ హైకోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తీసుకొచ్చాడు. దీంతో 2015–16, 2016–17కు సంబంధించి మొత్తం 200 యూనిట్లకు మంజూరును ఇచ్చారు. మంజూరైన లిస్టును వేముల సునీల్‌ తెలివిగా సేకరించి అందులో 43మందికి ఫోన్‌ చేసి తానే ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అని పరిచయం చేసుకున్నాడు.

తనకు మెప్మా, ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి రుణాలు ఇచ్చే బ్యాంకర్లు తెలుసునని.. మీకు వారికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పారు. అందులో భాగంగా 21మంది లబ్ధిదారుల నుంచి రూ.5,38,500లను తీసుకున్నాడు. అదేవిధంగా షాపు నిర్వాహకుడు భానుప్రసాద్‌కు డబ్బు ఆశ చూపించి నకిలీ కొటేషన్‌ లెటర్స్‌ను తీసుకుని రూ.2,92,55,000లకు సంబంధించిన కొటేషన్‌ను బ్యాంకర్లకు ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ వారు రూ.1,64,35,000లను సబ్సిడీ కింద లబ్ధిదారుల అకౌంట్‌లో వేశారు. 

అదేవిధంగా సునీల్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులను రూ.1,28,15,000లను దుర్వినియోగం చేస్తూ బ్యాంకుల్లో 43మంది లబ్ధిదారులకు సెక్యూరిటీ డిపాజిట్‌ చేసి 43 డీడీలను బ్యాంకుల నుంచి తీసుకుని ఇతనికి సహాయం చేస్తున్న భానుప్రసాద్‌ ద్వారా నకిలీ సంస్థల ఖాతాలో జమ చేశాడు. ఈ డబ్బులో తనకు 6శాతం ఇవ్వాలని భానుప్రసాద్‌ పేర్కొన్నాడు. అందుకు గాను సునీల్‌ రూ.17.40లక్షలతోపాటు రూ.4లక్షల కారుతో సహా భాను ప్రసాద్‌కు ఇచ్చాడు. ఏకంగా భానుప్రసాద్‌ ఇంట్లోనే ఈ నకిలీ కొటేషన్స్‌ను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం తన కుమారులైన వేముల నితిన్, వేముల అఖిల్‌ బ్యాంకు ఖాతాలకు రూ.15లక్షలు, రూ.21.78లక్షలను బదలాయించాడు. హైదరాబాద్‌కు చెందిన గోవింద్‌కుమార్‌ అగర్వాల్‌ వద్ద రూ.18లక్షలకు పార్చునర్‌ కారును కొనుగోలు చేసి మిగితా డబ్బును తన సొంతానికి వాడుకున్నాడు. అదేవిధంగా వీరికి ఎస్సీ కార్పొరేషన్‌లో అవుట్‌ సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ సురేష్‌ అనే వ్యక్తికి కూడా కొంత మేరకు డబ్బు ఇచ్చాడు. పోలీసుల విచారణలో దీనికి సంబంధించి తీగలాగగా డొంక  కదిలింది.  

324 యూనిట్లకు సంబంధించి రూ.6 కోట్లపై కూడా పోలీసుల విచారణ.. 
ఈ కేసులో భాగంగా ఇంకా 324 యూనిట్లలో రూ.6 కోట్లకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, మున్సిపల్, మెప్మా, బ్యాంకు అధికారుల ప్రమేయాన్ని విచారిస్తున్నామని, త్వరలోనే ఈ తీగనంతా కదిలిస్తామని ఏసీపీ తెలిపారు. వేముల సునీల్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని, దర్జాగా కనిపించేందుకు  పార్చునర్‌ కారును వాడటంతో పాటు మూడు ఎయిర్‌ గన్స్‌ను కూడా తనవద్ద ఉంచుకుని తిరుగుతుండేవాడని, ఎవరైనా లబ్ధిదారుడు వచ్చి తమ రుణం ఏమైందని అడిగితే  తుపాకులను చూపించి భయభ్రాంతులకు గురి చేసేవాడని ఏసీపీ తెలిపారు. అందులో భాగంగా అతని వద్ద పార్చునర్‌ కారు, మూడు ఎయిర్‌గన్స్, భానుప్రసాద్‌ షాపు వద్ద నుంచి నకిలీ బ్యాంక్‌ కొటేషన్లు, ఇతర నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసునున్నారు. సునీల్‌తో పాటు భాను ప్రసాద్‌ను, సునీల్‌ కుమారుడైన నితిన్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అయిన సుురేష్‌ను అరెస్ట్‌ చేశామని, ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారించి చర్య తీసుకోవడం జరుగతుందని ఏసీపీ వెంకట్రావు, తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో  టూటౌన్‌ సీఐ నరేందర్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top