నెల్లూరులో వ్యాపారి కాల్చివేత | Police announced the high alert in the city with Murder of Trader | Sakshi
Sakshi News home page

నెల్లూరులో వ్యాపారి కాల్చివేత

Nov 4 2018 5:08 AM | Updated on Sep 5 2022 12:06 PM

Police announced the high alert in the city with Murder of Trader - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): ఆర్థిక లావాదేవీలో, మరో కారణమో తెలియదుకానీ నెల్లూరులో శనివారం రాత్రి ఓ వ్యాపారిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వ్యాపారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్‌ రాష్ట్రం అర్తండిìకి చెందిన కె. మహేంద్రసింగ్‌(40), ఉష దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక కుమార్తె. సుమారు పదేళ్ల క్రితం మహేంద్రసింగ్‌ కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. ఫత్తేఖాన్‌పేటలో నివాసం ఉంటూ తొలుత మార్బుల్‌ పనులు చేసుకొంటూ జీవనం సాగించేవాడు. ఏడేళ్ల కిందట ఫత్తేఖాన్‌పేట రైతుబజారు ఎదురు దుకాణాల్లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని కోమల్‌ పవర్‌ టూర్స్‌ పేరిట మార్బుల్స్‌ పరికరాల విక్రయ దుకాణం ప్రారంభించాడు.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటలకు దుకాణం మూస్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై ముసుగులు ధరించి షాపు వద్దకు వచ్చారు. వెంట తెచ్చుకున్న గన్‌తో మహేంద్రసింగ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకి పేలిన శబ్ధం విని అందరూ ఉలిక్కిపడి ఏం జరిగిందోనని సంఘటనా స్థలానికి పరుగెత్తుతూ వచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మహేంద్రసింగ్‌ దుకాణం వద్దే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఛాతి, కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో రక్తస్రావం ఆగక అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. ఏఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి, డీఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడే ఉన్న అల్లాభక్షు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుని భార్య, పిల్లలు ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నబజారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement