మ్యాట్రిమోని సంబంధం: డాక్టర్నంటూ మోసం | Sakshi
Sakshi News home page

మ్యాట్రిమోని సైట్స్‌ను ఆశ్రయిస్తున్నారా..

Published Thu, Jul 19 2018 2:43 PM

Pak Man Said Matrimonial Site As Indian - Sakshi

ముంబై : పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా ముంబైకి చెందిన ఒక మహిళను వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ ఇంతలో సదరు యువతికి నకిలీ డాక్టర్‌పై అనుమానం రావడంతో అతని మోసం బయటపడింది. యువతి చెప్పిన వివరాల ప్రకారం ‘వరుడి కోసం నేను మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో నా వివరాలను అప్‌లోడ్‌ చేశాను. అప్పటి నుంచి నాకు చాలా ప్రపోజల్స్‌ వచ్చాయి. వాటిలో ఈ పాకిస్థాన్‌ అభ్యర్థి కూడా ఉన్నాడు. ఇతనితో నేను ఈ నెల 1 నుంచి వాట్సాప్‌లో మాట్లాడటం ప్రారంభించాను.

ఈ క్రమంలో సదరు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తనను తాను ఇండియాకు చెందిన వైద్యునిగా పరిచయం చేసుకున్నాడు. ఒక కాంట్రాక్ట్‌లో భాగంగా ప్రస్తుతం లండన్‌లో పనిచేస్తున్నానని తెలిపాడు. కాంట్రాక్ట్‌ పూర్తవగానే ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టానన్నాడు. నేను అతని అభిరుచుల గురించి అడిగినప్పుడు సరిగ్గా స్పందించలేదు. మరి కొన్ని విషయాల్లో అతని కదలికలు కాస్తా అనుమానాస్పదంగా ఉండటంతో అతను పనిచేస్తున్న ఆస్పత్రి ఫోటోలు పంపించమని అడిగాను.

ఫోటోలు చూసిన తర్వాత సదరు ఆస్పత్రికి ఫోన్‌ చేసి ఇతని గురించి వాకబు చేశాను. కానీ ఆస్పత్రి యాజమాన్యం అటువంటి పేరు గల వ్యక్తి ఎవరూ తమ ఆస్పత్రిలో పనిచేయడం లేదని తెలిపారు. అంతేకాక అతను పంపిన ఫోటోల్లో ఒక దాని మీద ఫోటో స్టూడియో నంబర్‌ ఉంది. నేను ఆ నంబర్‌కు కాల్‌ చేసినప్పుడు, నకిలీ పాక్‌ డాక్టర్‌ స్నేహితుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు. నేను అతనికి నా మీద అనుమానం రాకుండా నకిలీ డాక్టర్‌ వివరాలను సేకరించాను. ఫోటో స్టూడియో వ్యక్తి చెప్పిన వివరాలు విన్న తర్వాత నేను షాక్‌ అయ్యాను’ అన్నారు.

ఫోటో స్టూడియో అతను చెప్పిన దాని ప్రకారం సదరు నకిలీ డాక్టర్‌ చాలా ఏళ్లుగా పాకిస్తాన్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇంతకు ముందే వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంతే కాక ఆ వ్యక్తి గతంలో తాను డాక్టర్‌నని చెప్పి చాలా మంది మహిళలని ఇలానే మోసం చేశాడని తెలిసిందన్నారు.

అనంతరం నకిలీ డాక్టర్‌ నాకు ఫోన్‌ చేసినప్పుడు అతన్ని సూటిగా పాకిస్థాన్‌లో మీది ఏ జిల్లా అని అడగ్గానే అతను ముందు కాస్తా తడబడ్డాడు. కాదని బుకాయించే ప్రయత్నం చేశాడు. చివరకూ అది కూడా కుదరకపోవడంతో నన్ను చంపుతానని బెదిరించాడు. దాంతో నేను పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. అతని మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకూ ఈ విషయాన్ని వదిలిపెట్టనని బాధిత మహిళ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement