
జావిద్ హుసేన్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచ్చిలో ఒన్ సైడ్ లవ్ వ్యవహారంలో అమముక కార్యదర్శి బుధవారం దారుణహత్యకు గురయ్యాడు. తిరుచ్చి మేల్‌కలండ కోట మసీదు వీధికి చెందిన ఖాదర్‌హుసేన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇతని కుమారుడు జావిద్‌హుసేన్ (24). పొన్నమలై అమముక మైనారిటీ విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. డిప్లొమో చదువుకున్న హుసేన్ చెన్నై ఐసీఎఫ్‌లో అప్రెంటీస్‌గా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదిలాఉండగా పొన్నమలై ప్రాంతానికి చెందిన ప్లస్ ఒన్ విద్యార్థినిని ఒన్‌సైడ్ లవ్‌గా ప్రేమిస్తూ వచ్చాడు. విద్యార్థిని ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటపడుతూ ప్రేమించమని ఒత్తిడి చేసేవాడు. తన వెంట పడవవద్దని, హద్దుమీరితే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించింది.
అయినా కూడా జావిద్‌హుసేన్ విద్యార్థిని వెంటపడడం మానలేదు. ఇదిలాఉండగా, బుధవారం సాయంత్రం జావిద్‌హుసేన్ పొన్నమలై ప్రాంతంలో కోడి మాంసం దుకాణానికి వెళ్లగా, మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు జావిద్‌తో ప్రేమ వ్యవహారంపై గొడవపడ్డారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు యువకులు తాము తీసుకువచ్చిన కత్తితో జావిద్ హుసేన్‌పై వేటు వేశారు. వారి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు జావిద్‌హుసేన్ పరుగులు తీయగా ఇద్దరు వ్యక్తులు వెంటపడి కత్తితో నరకడంతో జావిద్‌హుసేన్ ప్రాణాలు విడిచాడు. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా హత్యకు పాల్పడింది విద్యార్థిని సోదరుడు, అతని స్నేహితుడని పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో దాగి ఉన్న విద్యార్థిని సోదరుడు కమలకన్నన్, అతని స్నేహితుడు శరవణకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.