భారీ ఉగ్ర కుట్ర భగ్నం

NIA raids in Delhi and UP at 16 locations recovers explosives, rocket launcher - Sakshi

గణతంత్ర వేడుకలకు ముందు దేశంలో కలకలం

10 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ

ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ నాయకులే వీరి టార్గెట్‌

ఆత్మాహుతి దాడులు, వరస పేలుళ్లతో మారణహోమానికి ప్రణాళిక

న్యూఢిల్లీ
గణతంత్ర వేడుకలకు సరిగ్గా నెల రోజుల ముందు దేశంలో ఉలికిపాటు. దేశంలో భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ – నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) చాకచక్యంగా పట్టుకుని వారి కుట్రను భగ్నం చేసింది. ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్న, హర్కత్‌–ఉల్‌–హర్బ్‌–ఇ–ఇస్లాం (ఇస్లాం కోసం యుద్ధం) అనే సంస్థకు చెందిన 10 మంది అనుమానితులను ఎన్‌ఐఏ బుధవారం అరెస్టు చేసింది.

ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలే వీరి లక్ష్యమనీ, సంస్థలోని సభ్యులంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారేనని వెల్లడించింది. అరెస్టయిన వారంతా ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్రా లేని వారేననీ, ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహాకు చెందిన ఓ ముఫ్తీ (ముస్లిం మతాచారాలపై తీర్పులిచ్చే న్యాయ నిపుణుడు) కూడా వీరిలో ఉన్నాడనీ, ఇతనే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అని ఎన్‌ఏఐ ఐజీ అలోక్‌ మిత్తల్‌ చెప్పారు.

ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఆమ్రోహ, లక్నోల్లో సోదాలు జరిపి, స్థానికంగా తయారు చేసుకున్న రాకెట్‌ లాంచర్‌ సహా పలు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సోదాల అనంతరం హర్కత్‌–ఉల్‌–హర్బ్‌–ఇ–ఇస్లాంకు చెందిన మొత్తం 16 మందిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిని విచారించి 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసింది. మరింత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని అలోక్‌ మిత్తల్‌ చెప్పారు.

సమాచారంతో ముందస్తుగానే నిఘా
సోదాల్లో చేతితో తయారు చేసిన ఆయుధాలు, ఇంకా పరీక్షించాల్సి ఉన్న రాకెట్‌ లాంచర్, ఆత్మాహుతి జాకెట్ల తయారీకి ఉపయోగించే పదార్థాలు, వంద అలారం గడియారాలు, 12 నాటు తుపాకీలు, వందలకొద్దీ బుల్లెట్లు, వంద మొబైల్‌ ఫోన్లు, 135 సిమ్‌కార్డులు, ఏడున్నర లక్షల రూపాయల డబ్బు, బాంబు తయారీలో వాడే పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ తదితరాలను భారీ మొత్తాల్లో ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఏయే ప్రభుత్వ సంస్థలపై, రాజకీయ నాయకులపై దాడులు చేయాలో ఇప్పటికే వారు రెక్కీ నిర్వహించారనీ, మరికొన్ని రోజుల్లో దాడులు చేయడానికి సిద్ధమయ్యారని అలోక్‌ చెప్పారు.

హర్కత్‌–ఉల్‌–హర్బ్‌–ఇ–ఇస్లాం ప్రణాళికల గురించి తమకు ముందుగానే సమాచారం వచ్చిందనీ, అప్పటి నుంచి వారిపై ఎన్‌ఐఏ నిఘా పెట్టిందన్నారు. అనుమానిత ఉగ్రవాదులు చాలా వేగంగా బాంబులు తయారు చేస్తూ పోతుండటంతో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ విభాగంలోని ఉగ్రవాద వ్యతిరేక దళంతో కలిసి ఎన్‌ఐఏ వారి కుట్రను బుధవారం భగ్నం చేశామని అలోక్‌ తెలిపారు. వీరి హిట్‌ లిస్ట్‌లో ఢిల్లీ పోలీస్, ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని ఇతర దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్‌ఐఏ సీనియర్‌ అధికారి ఒకరు స్పందిస్తూ ‘ఇతర సంస్థలు వారికి ఇష్టమొచ్చింది ఏదైనా చెప్తాయి. ఈ కేసును దర్యా ప్తు చేస్తున్నది మేము. ఆధారాల్లేకుండా మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేం’ అని అన్నారు.

నెట్‌లో చూసి నేర్చుకున్నారు!
ఎన్‌ఐఏ ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను ఆమ్రోహాలో, మరో పది మందిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన నిధులను హర్కత్‌–ఉల్‌–హర్బ్‌–ఇ–ఇస్లాం సభ్యులు సొంతంగానే సమకూర్చుకున్నారంది. ‘పేలుడు పదార్థాల తయారీలో వీరు ఇప్పటికే చాలా పురో గతి సాధించారు. బాంబులను ఇక జతపరచడమే తరువాయి. ఆ తర్వాత రిమోట్‌ కంట్రో ల్‌ బాంబులతో, ఆత్మాహుతి దాడులతో, పైప్‌ బాంబులతో దేశంలో భయోత్పాతం సృష్టించాలనేది వీరి ప్రణాళిక’ అని అలోక్‌ మిత్తల్‌ వెల్లడించారు.

అరెస్టయిన వారిలో ముఫ్తీ మహ్మద్‌ సుహైల్‌ (29)తోపాటు నోయిడాలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థి, హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్‌ మూడో ఏడాది చదువుతున్న మరో విద్యార్థి కూడా ఉన్నారని అలోక్‌ చెప్పారు. మరో ఇద్దరు వెల్డింగ్‌ పని చేసుకుని జీవనం సాగించేవారన్నారు. ‘దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం హర్కత్‌ సంస్థను మూడు, నాలుగు నెలల క్రితం సుహైల్‌ స్థాపించి, వివిధ వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నాడు.

వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్‌ల ద్వారా వారు సంభా షించుకున్నారు. బాంబులు ఎలా చేయాలో వీరికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదనీ, ఇంటర్నెట్‌లో చూసి సొంతంగానే నేర్చుకున్నట్లు ప్రాథమి కంగా తెలుస్తోంది’ అని అలోక్‌ వివరించారు. సోదాల్లో తమకు ఓ వీడియో లభించిందనీ, బాంబులు ఎలా తయారు చేయాలో సుహైల్‌ ఇతరులకు సూచనలిస్తూ రూపొందించిన వీడియో అది అని తెలిపారు.

విద్యార్థులు.. వెల్డర్లు.. ఇమామ్‌లు
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) భగ్నం చేసిన ఐసిస్‌ ప్రేరేపిత ఉగ్ర ముఠాలోని సభ్యులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారందరి వయసు 20–35 ఏళ్ల మధ్య ఉంది. అందులో కొందరు విద్యార్థులు కాగా, మరికొందరు వెల్డింగ్, వస్త్ర దుకాణం లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారి ముఫ్తీ మహ్మద్‌ సుహైల్‌ వారందరినీ ఇస్లాం పేరిట ప్రభావితం చేశాడని ఎన్‌ఐఏ ఆరోపించింది. వారి వ్యక్తిగత వివరాలిలా ఉన్నాయి.  

1. ముఫ్తీ మహ్మద్‌ సుహైల్‌ అలియాస్‌ హజ్రత్‌ (29): ఈ బృందం వ్యవస్థాపకుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన హజ్రత్‌ స్థానిక మదరసాలో ముఫ్తీగా పనిచేస్తున్నాడు. 3–4 నెలల క్రితం ఈ సంస్థను స్థాపించి ఆన్‌లైన్‌లో ఐసిస్‌ భావజాలాన్ని బోధించాడు. బాంబును ఎలా తయారుచేయాలో అతడు సభ్యులకు వివరిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూసింది.

2.అనాస్‌ యూనస్‌ (24): జఫ్రాబాద్‌కు చెందిన యూనస్‌ నోయిడాలోని ఓ ప్రైవేట్‌ వర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. బాంబులు తయారుచేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్‌ వస్తువులు, బ్యాటరీలను సేకరించాడు.

3.రషీద్‌ జాఫర్‌ రఖ్‌ అలియాస్‌ జాఫర్‌ (23): జఫ్రాబాద్‌కు చెందిన ఇతడు బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

4.సయీద్‌ (28): అమ్రోహాలోని సైదాపూర్‌ ఇమ్మాకు చెందినవాడు. వెల్డింగ్‌ దుకాణం నిర్వహిస్తున్న ఇతడు పిస్టల్స్, రాకెట్‌ లాంచర్లను తయారుచేశాడు.

5.రాయీస్‌ అహ్మద్‌: సయీద్‌కు సోదరుడు. ఇతనికి కూడా వెల్డింగ్‌ దుకాణం ఉంది. సోదరులిద్దరూ ఐఈడీలను తయారుచేయడానికి 25 కిలోల పేలుడు పదార్థాలు, గన్‌పౌడర్‌ను సేకరించారు.

6.జుబైర్‌  మాలిక్‌ (20): జఫ్రాబాద్‌కు చెందిన మాలిక్‌ ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

7.జైద్‌ (22): జుబైర్‌ సోదరుడు. నకిలీ పత్రాలతో సోదరులిద్దరూ సిమ్‌ కార్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేశారు. సొంతింటి నుంచే బంగారం దొంగిలించి డబ్బు సమకూర్చుకున్నారు.

8.సాకిబ్‌ ఇఫ్తికార్‌ (26): ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌కు చెందినవాడు. బక్సార్‌లోని మదరసాలో ఇమామ్‌గా పనిచేస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్‌కు సాయం చేశాడు.

9.మహ్మద్‌ ఇర్షాద్‌ (28): ఆటోరిక్షా నడిపే ఇర్షాద్‌ అమ్రోహా నివాసి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దాచేందుకు రహస్య ప్రాంతాన్ని కనుగొనడంలో హజ్రత్‌కు సాయం చేశాడు.

10. మహ్మద్‌ ఆజామ్‌ (35): ఢిల్లీలోని చౌహాన్‌ బజార్‌ నివాసి. మెడికల్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్‌కు సాయం చేశాడు.


బుధవారం జఫ్రాబాద్‌లో తనిఖీల్లో పాల్గొన్న ఎన్‌ఐఏ, ఢిల్లీ పోలీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top