
హైదరాబాద్: మక్కా మసీదులో బాంబు పేలుడు కేసులో సంచలన తీర్పు చెప్పిన జడ్జి రవీందర్‌రెడ్డికి సంబంధించి అనూహ్య కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జిగా మక్కా పేలుళ్ల కేసును కొట్టివేసిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో పదవీ విరమణ పొందాల్సిన ఆయన హఠాత్తుగా వైదొలగడం, రాజీనామాకు గల కారణాలు స్పష్టంగా వెల్లడికాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రవీందర్ రెడ్డి రాజీనామాపై ఇటు నాంపల్లి కోర్టులో, అటు హైకోర్టులో ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. కాగా, సదరు జడ్జిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు కూడా సాగుతున్నదని ‘ఇండియా టుడే’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన పలువురు జడ్జిలు లంచాల కేసుల్లో అరెస్టై జైలుపాలైన నేపథ్యంలో తాజా కథనం ప్రాధాన్యం సంతరించుకుంది.
(చదవండి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత)