పోలీసులు చూస్తుండగానే మరో దాడి

New Video Of Meerut Woman's Muslim Friend Being Beaten As Cop Watches - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లిందన్న కారణంగా పోలీసు జీపులో ఓ మహిళా పోలీసు, 20 ఏళ్ల విద్యార్థినిని పట్టుకొని చెంప చెళ్లుమనిపించడం, ‘నీ చుట్టూరా ఎంతో మంది హిందువులుంటే నీకో ముస్లిం యువకుడే కావాల్సి వచ్చిందే’ అంటూ పక్కనే ఉన్న మరో మహిళా పోలీసు వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో పోలీసు జీపులో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వీడియోను రికార్డు చేసినట్లు భావిస్తున్న హోం గార్డుపై యోగి అదిత్యనాథ్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

మీరట్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ యూనివర్శిటీకి చెందిన నర్సింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని, తనతోపాటే చదువుతున్న 22 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఉంటున్న జాగృతి విహార్‌కు ఆదివారం నాడు వెళ్లింది. జాగృతి విహార్, వారు చదువుతున్న నర్సింగ్‌ కాలేజీకి ఎదురుగానే ఉంది. మీరట్‌ వైద్య యూనివర్శిటీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఆ జాగృతి విహార్‌లోనే ఉంటారు. అందులో కిరాయి తీసుకొని ఉంటున్న ముస్లిం యువకుడి వద్దకు ఆ విద్యార్థిని వెళ్లడం గమనించిన స్థానికులు విశ్వ హిందూ పరిషత్‌కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఆ జంటను పట్టుకొని కొట్టారు. ఈ విషయాన్ని ఎవరో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయగా, మహిళా పోలీసులు వచ్చి మహిళను రక్షించి జీపులో తీసుకెళ్లారు.

తాము జాగృతి విహార్‌పై దాడి చేసినప్పుడు ఆ యువ జంట ప్రేమించుకుంటున్నారని, వారిని హెచ్చరించి పోలీసులకు అప్పగించామని, వారిపై చేయి చేసుకోలేదని వీహెచ్‌పీ స్థానిక నాయకుడు బలరాజ్‌ దూంగర్‌ తెలిపారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి హెపూర్‌లో ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు వెళ్లి, ముస్లిం యువకుడిపై కేసు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారు క్లాస్‌మేట్స్‌ మాత్రమేనని, వారి మధ్య మరెలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి తండ్రి చెబుతూ వస్తున్నారు. బుధవారం రాత్రి వరకు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే విద్యార్థినిగానీ, ముస్లిం యువకుడుగానీ ఎక్కడున్నారో తెలియడం లేదు.

ఆదివారం ఈ సంఘటన జరిగిన నాటి నుంచి నర్సింగ్‌ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సంఘటనపై కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌ శర్మను మీడియా ప్రశ్నించగా, తమది కో ఎడ్యుకేషన్‌ కాలేజని, విద్యార్థిని, ముస్లిం యువకుడు క్లాస్‌మేట్స్‌ అని తెలిపారు. నర్సింగ్‌ కాలేజీ అవడం వల్ల ల్యాబుల్లో కూడా ఆడ, మగ కలిసే పనిచేయాల్సి వస్తుందని, కలుసుకోవద్దని, పరిచయాలు పెంచుకోవద్దని వారికి తాము చెప్పలేమని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కళాశాలకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. యూనివర్శిటీలో హిందూత్వ సంస్థల ఉనికి పెరిగినప్పటి నుంచి అశాంతి పరిస్థితులు పెరుగుతున్నాయని అధ్యాపకులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం శోచనీయమని, అందుకే మహిళా పోలీసులపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని సబ్‌ ఇనిస్పెక్టర్‌ సతీష్‌ కుమార్‌ తెలిపారు.

కాగా, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది. పోలీసుల సమక్షంలోనే ముస్లిం యువకుడిపై గూండాలు దాడి చేసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి చర్యలను సహించబోమని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని యూపీ డీజీపీ ట్వీట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top