లక్ష్మీవరతీర్థ స్వామి మృతి కేసులో మలుపులు

New Twist In Swamy ji Death Case Karnataka - Sakshi

శిరూరు మఠంలో బంగారం మాయం

స్వర్ణ నదిలో దొరికిన వీడియో రికార్డర్‌  

రమ్యాశెట్టి ముమ్మర విచారణ

యశవంతపుర(కర్ణాటక): ఉడిపి శిరూరు మఠాధిపతి  లక్ష్మీవరతీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసు విచారిస్తున్న పోలీసులకు మఠం పక్కలోని స్వర్ణనదిలో డీవీఆర్‌ (వీడియో రికార్డర్‌) బాక్స్‌ దొరికింది. స్వామి ధరించిన అనేక బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నిత్యం స్వామి వేసుకున్న చేతి కడియాలు, మెడలో వేసుకునే ఖరీదైన బంగారు గొలుసు, చేతి ఉంగరం, బంగారు తుళసి మాల కనిపించటం లేదు. స్వామికి చెందిన మూడు బంగారు కడియాలలో ఒక కడియాన్ని అప్పుడప్పుడు ఆయన భక్తురాలుగా చెప్పుకునే రమ్యాశెట్టి  ధరించేవారని తెలిసింది. ఆమె నగలు ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనితో మిగిలిన బంగారును కూడా రమ్యాశెట్టినే దాచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

బంగారంపై రమ్యాశెట్టి మక్కువ  
భక్తులు దానం చేసిన బంగారంపై రమ్యాశెట్టికి వ్యామోహం పెరగటంతో శుభ కార్యాలకు స్వామి ధరించే బంగారాన్ని ఆమె ధరించేవారని  తెలిసింది. స్వామి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తరువాత మఠంలోని బంగారు అభరణాలు గల్లంతయినట్లు ప్రచారం జరుగుతోంది. మణిపాల్‌ ఆస్పత్రిలో చేరినప్పుడు అయన చేతికి మూడు ఉంగరాలు ఉండగా, మిగిలిన నగలను మఠంలోని తన గదిలో భద్రపరిచిన్నట్లు తెలిసింది. దీనితో మఠంలో పని చేస్తున్న అనుమానితులను పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. స్వామి తన వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు సమాచారం. ఆయన నిత్యం ఒక కేజీ బంగారు నగలను ధరించేవారు. అవి చాలా పురాతన కాలం నాటివని భక్తులు అంటున్నారు. రమ్యాశెట్టి మాత్రమే స్వామి గదికి వెళ్లేవారని రెండు రోజుల నుండి ఆమెను విచారిస్తున్న పోలీసులు చెబుతున్నారు. 

అజ్ఞాతంలో రమ్యా విచారణ  
మంగళవారం సాయంత్రం నుండి రమ్యాశెట్టిని పోలీసులు అజ్ణాత ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఆమె ఐదు మంది సహచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారు వాడిన ముబైల్‌ నంబర్ల ఆధారంగా ముంబైకి లింక్‌లు ఉన్నట్లు నిర్థారించారు. బంధుమిత్రుల శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె పోటోలను పోలీసులు సేకరిస్తున్నారు. గత రెండేళ్ల నుండి అమె స్వామిని మోసపుచ్చి లూటీ చేసిదంటూ సామాజిక మాధ్యమాలలో ఆరోపణలు వస్తున్నాయి. రమ్యాశెట్టి సుళ్యకు చెందిన మహిళ కాగా, ఆమె ముంబైలో కూడా కొంతకాలం నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మఠానికి అప్పుడప్పుడు ముంబైకి చెందిన బంగారం వ్యాపారులను పిలిపించి స్వామికి పరిచయం చేసినట్లు తెలిసింది. నాలుగు నెల క్రితం ఒక యాంటిక్‌ ఆభరణాన్ని ఆమె ధరించినట్లు పోలీసులు ఒక ఫోటోను సేకరించారు. దానిని స్వామి కూడా కొన్నిసార్లు ధరించినట్లు గుర్తించారు. 

నిత్య పూజలు ప్రారంభం
బుధవారం నుండి శిరూరు మఠంలో నిత్యపూజలు, నైవేద్యలను ప్రారంభించారు. మూల మఠంలో ముఖ్యప్రాణ, మూల దేవుడుకి నైవేద్యం పెట్టి పూజలు చేశారు. లక్ష్మీ వరతీర్థస్వామి రోజు నాలుగుసార్లు బియ్యంతో నైవేద్యం, మూడుసార్లు పూజలు చేసేవారని భక్తులు తెలిపారు. మఠంలోనికి అర్చకులు, సిబ్బంది తప్ప భక్తులను అనుమతించటం లేదు. పోలీసుల విచారణ ముగిసిన తరువాత తదుపరి పీఠాధపతిని నియమించే అవకాశం ఉంది.   

నదిలో డీవీఆర్‌ స్వాధీనం
మఠం పరిధిలోని బావిలో డీవీఆర్‌ దొరికిందని అందరూ ఊహించారు. కానీ దొరికిన మూటలో విదేశీ మద్యం, కండోమ్స్‌ లభించాయి. స్వామి నిద్రించే గదిలో కొన్ని ఔషధాలు కనిపించాయి. రమ్యాశెట్టితో సన్నిహితంగా ఉన్న అటోడ్రైవర్‌ జగదీశ్‌ను కూడా విచారిస్తున్నారు. డీవీఆర్‌ను హిరియడ్క మఠం పక్కలోని స్వర్ణ నదిలో పడేసిన్నట్లు చెప్పడంతో అక్కడ  బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో గజ ఈతగాళ్ల సాయంతో దీనిని బయటకు తీశారు. రికార్డయిన సమాచారం ఉందో లేదో పోలీసులకు అర్థం కావటంలేదు. నదిలో వేసింది ఎవరనేది పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top