లలితా జ్యువెలరీ కేసులో మలుపు

New Twist in Lalitha Jewellery Robbery Case Tamil nadu - Sakshi

లలితా జ్యువెలరీ కేసులో మలుపు

రూ.10 కోట్ల నగలు, నటితో పరార్‌

దొంగల ముఠా నేత కోసం పోలీసుల గాలింపు

చెన్నై,టీ.నగర్‌: తిరుచ్చి లలితా జ్యువెలరీలో నగల చోరీ కేసు మరో మలుపు తిరిగింది. నగలు చోరీ చేసిన దొంగల ముఠా నేత రూ.10 కోట్ల విలువైన నగలు, నటితో శ్రీలంకకు పరారైనట్లు సమాచారం అందింది. వివరాలు.. తిరుచ్చి సత్రం బస్టాండులోని ప్రముఖ నగల దుకాణం లలితా జ్యువెలరీలో ఈనెల 2వ తేదీన రూ.13 కోట్ల విలువైన నగలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనికి సంబంధించి తిరువారూరు మడపురానికి చెందిన మణికంఠన్‌ నాలుగు కిలోల బంగారు నగలతో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో సురేష్, అతని మామ పేరుమోసిన దొంగని, తిరువారూరు మురుగన్‌తో కలిసి రూ.13 కోట్ల నగలను దోచుకున్నట్లు మణికంఠన్‌ ఒప్పుకున్నాడు. ఇలా ఉండగా తిరువారూర్‌ మురుగన్‌ రూ.10 కోట్ల నగలతో శ్రీలంకకు పరారైనట్లు తెలిసింది. నగలతోపాటు నటిని వెంటబెట్టుకుని వెళ్లినట్లు విచారణలో తేలింది. ఇతనికి చెన్నై ఈసీఆర్‌లో లగ్జరీ బంగళా, ఇతర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మురుగన్‌ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు, నగల దుకాణాలు, ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో చేతివాటాన్ని ప్రదర్శించాడు. కాగా మురుగన్‌ ఎయిడ్స్‌ రోగి అని వెల్లడైంది.

ఐదుగురిని అరెస్ట్‌ చేస్తాం:కమిషనర్‌ అమల్‌రాజ్‌ తిరుచ్చి లలితా జ్యువెలరీ దోపిడీ నిందితులు ఐదుగురిని త్వరలో అరెస్టు చేస్తామని విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్‌ అమల్‌రాజ్‌ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top