నరేష్‌ హత్య కేసు దర్యాప్తు లోపభూయిష్టం

Naresh Wife Demand For Change Inquiry Officer Prakasam - Sakshi

రెండు లారీల్లో ఎస్పీని కలిసేందుకు కడవకుదురు నుంచి గ్రామస్తులు

అమాయకులను పట్టుకుని అసలు నేరస్తులు వదిలేశారు..

దర్యాప్తు అధికారిని మార్చాలని నరేష్‌ భార్య సంధ్య వేడుకోలు

పర్చూరు ఎమ్మెల్యే సిఫార్సుల మేరకే కేసును నీరుగారుస్తున్నారని ఫిర్యాదు

ఒంగోలు క్రైం:  చినగంజాం మండలం కడవకుదురులో ఇటీవల టంగుటూరి నరేష్‌ హత్య కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని నరేష్‌ భార్యతో పాటు కడవకుదురు గ్రామస్తులు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడవకుదురు నుంచి రెండు లారీల్లో గ్రామస్తులు మంగళవారం ఒంగోలుకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. కలెక్టర్‌ సమావేశంలో ఉండటంతో అనంతరం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబును కలిసేందుకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు గ్రామస్తులు చేరుకున్నారు. భారీ సంఖ్యలో కడవకుదురు గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్దకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు ఒంగోలు తాలూకా, ఒంగోలు టూటౌన్, ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు.

దీంతో ఎస్పీ కార్యాలయ ప్రధాన గేటు వద్ద పోలీసులు మోహరించారు. దాదాపు 150 మందికి పైగా గ్రామస్తులు లారీల్లో ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎస్పీకి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చామని చెప్పడంతో డీఎస్పీ  బి.శ్రీనివాసరావు.. నరేష్‌ సతీమణి సంధ్యతో పాటు మరో నలుగురిని మాత్రమే ఎస్పీని కలిసేందుకు అనుమతించారు. దీంతో ఎస్పీని కలిసి నరేష్‌ హత్యకు సంబంధించిన కేసు దర్యాప్తు రాజకీయ నాయకులు, ముఖ్యంగా పర్చూరు ఎమ్మెల్యే ఎలా చెబితే ఆ విధంగా ఇంకొల్లు సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించి అసలు నేరస్తులను తప్పించారని వివరించారు. హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న ఇంకొల్లు సీఐని తప్పించి డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించాలని ఎస్పీని కోరారు.

వాస్తవాలను తొక్కిపెడుతున్నారని, ఇంకొల్లు సీఐ తీరుతో కేసును నీరుగార్చే పనిలో ఉన్నారన్నారని వివరించారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు కూడా వాస్తవ నివేదిక ఇవ్వలేదని, నరేష్‌ శరీరంపై గాయాలున్నా వాటిని కనబరచలేదని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో రాజకీయంగా చిచ్చుపెట్టే పనిలో అధికార పార్టీ నాయకులు తలమునకలయ్యారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top