
టీ.నగర్: చెన్నై పులియాంతోపులో ఉచితంగా అరటిపండు కోరిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టుచేసి జైలులో ఉంచారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై ఓట్టేరి బెంజిలైన్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ వికలాంగుడు. ఇతను పులియాంతోపు టవర్‌క్లాక్ సమీపాన తోపుడుబండిలో పండ్లు విక్రయిస్తుంటాడు. ఓట్టేరి సచ్చిదానందం వీధికి చెందిన మురుగన్ అనే యువకుడు గత నెల 29వ తేదీన కృష్ణన్‌ను ఉచితంగా అరటిపండు ఇవ్వమని అడిగాడు.
ఇందుకు వ్యతిరేకించిన కృష్ణన్ డబ్బులిస్తేనే ఇస్తానని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆ తరువాత ఇరువురు బాహాబాహి తలపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహించిన కృష్ణన్ దుడ్డుకర్రతో మురుగన్‌పై తీవ్రంగా దాడిచేశాడు. ఇందులో తీవ్రంగా గాయపడిన మురుగన్‌ను స్థానికులు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు తీవ్ర చికిత్సలు అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మురుగన్ మృతి చెందాడు. ఈ సంఘటన గురించి ఇన్‌స్పెక్టర్ రవి కేసు నమోదు చేసి పళ్ల వ్యాపారి కృష్ణన్‌ను అరెస్టుచేసి జైలులో నిర్బంధించారు.