భారీ కుంభకోణం!

More Indian banks entangled in PNB fraud - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ. 11,300 కోట్ల మోసపూరిత లావాదేవీలు 

ముంబై బ్రాంచిలో గుర్తింపు

పది మంది ఉద్యోగుల సస్పెన్షన్‌

సీబీఐకి ఫిర్యాదు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ’భారీ కుంభకోణం’ వెలుగుచూసింది. 1.77 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలింది. ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. కొంత మంది ఖాతాదారులతో కుమ్మక్కైన కొందరు ఉద్యోగులు.. వారికి ప్రయోజనం చేకూర్చేలా మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. ఈ లావాదేవీల ఆధారంగా.. సదరు కస్టమర్లకు విదేశాల్లో మరికొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లుగా తెలుస్తోందని వివరించింది. దీంతో, వీటి ప్రభావం మరిన్ని బ్యాంకులకు కూడా విస్తరించి ఉండవచ్చని పేర్కొంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ‘ముంబైలోని ఒక శాఖలో కొందరు ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేలా కొంతమంది సిబ్బంది కుమ్మక్కై కొన్ని మోసపూరిత, అనధికారిక లావాదేవీలకు తెరతీసినట్లు గుర్తించడం జరిగింది‘ అని పీఎన్‌బీ వివరించింది. ఈ వ్యవహారంలో 10 మంది ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్‌ చేసింది. ఈ ఉదంతం ఒక బ్యాంకుకు మాత్రమే పరిమితమైనదని, మిగతా బ్యాంకులపై ప్రభావమేమీ ఉండబోదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని.. సత్వర చర్యల కోసం సీబీఐకి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి దీనిపై ఫిర్యాదు చేయాలని బ్యాంకుకు సూచించిందని ఆయన పేర్కొన్నారు.  ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ మొండిబాకీల సమస్యతో సతమతమవుతుండగా.. మరోవైపు ఈ తరహా మోసాలు వాటికి మరింత ప్రతికూలంగా మారుతున్నాయి. సుమారు మూడేళ్ల క్రితం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కూడా ఈ తరహాలో దాదాపు రూ. 6,000 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  

నీరవ్‌ మోదీపై సీబీఐకి ఫిర్యాదు.. 
ఈ కుంభకోణానికి సంబంధించి వజ్రాభరణాల డిజైనర్‌ నీరవ్‌ మోదీతో పాటు ఒక ఆభరణాల సంస్థపై సీబీఐకి పీఎన్‌బీ నుంచి రెండు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే రూ. 281 కోట్ల మేర మోసం చేశారన్న పీఎన్‌బీ ఫిర్యాదుతో నీరవ్‌ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, వ్యాపార భాగస్వామి మెహుల్‌ చీనుభాయ్‌ చోక్సీలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుమారు రూ. 280.7 కోట్లకు మోసపూరితంగా ఎల్‌వోయూలు జారీ అయ్యాయంటూ పీఎన్‌బీ గత వారం సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇందులో డైమండ్స్‌ ఆర్‌ అజ్, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్‌ డైమండ్స్‌ కంపెనీలను పీఎన్‌బీ తన ఫిర్యాదులో ప్రస్తావించింది. విదేశీ సంస్థలకు చెల్లింపుల కోసం ఎల్‌వోయూలు కావాలంటూ జనవరి 16న ఈ సంస్థలు అభ్యర్ధించాయని పేర్కొంది. పూర్తిగా నగదు మార్జిన్‌ ఉంటేనే ఎల్‌వోయూ జారీ చేస్తామని స్పష్టం చేయగా, దీన్ని వ్యతిరేకించిన సదరు సంస్థలు 2010 నుంచి ఈ తరహా వెసులుబాటు తాము పొందుతూనే ఉన్నామని చెప్పినట్లు పీఎన్‌బీ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఈ అంశంపై మరింత లోతుగా విచారణ  
జరుపుతున్నట్లు పేర్కొంది.  

పీఎన్‌బీ తాజా ఫిర్యాదుతో నీరవ్‌ మోదీ మరో కేసును కూడా ఎదుర్కొనాల్సి రానుంది. మరోవైపు, ప్రస్తుత ఉదంతంతో.. నీరవ్‌ మోదీ సహా నాలుగు బడా జ్యుయలరీ సంస్థలపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. గీతాంజలి, జిన్ని, నక్షత్ర ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఈ సంస్థలు వివిధ బ్యాంకులతో నిర్వహిస్తున్న లావాదేవీలు, తీసుకున్న నిధులను ఏ విధంగా ఉపయోగిస్తున్నాయి తదితర అంశాలను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పరిశీలిస్తున్నట్లు వివరించారు.  

మిగతా బ్యాంకులను కూడా నివేదికలు కోరిన కేంద్రం.. 
పీఎన్‌బీ ఉదంతంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీనితో ముడిపడి ఉన్న లావాదేవీలతో పాటు ఈ తరహా ఇతరత్రా వ్యవహారాలేమైనా ఉంటే సత్వరం తమకు నివేదిక పంపాలంటూ మిగతా బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ఈ వారాంతంలోగా నివేదికలు పంపాలని పేర్కొంది. పీఎన్‌బీలో మోసపూరిత లావాదేవీల ప్రభావం మరిన్ని బ్యాంకులకు కూడా విస్తరించినందున కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మోసం జరిగిందిలా.. 
పీఎన్‌బీ సిబ్బంది మోసపూరితంగా.. బిలియనీర్‌ నీరవ్‌ మోదీ, ఆయన సంబంధీకులకు లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ) జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని ఉపయోగించుకుని మోదీ తదితరులు విదేశాల్లోని పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు వివరించాయి. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి ఉద్యోగి కూడా ఈ మొత్తం వ్యవహారంలో కుమ్మక్కైనట్లు, 2011 నుంచి ఇది జరుగుతోందని పేర్కొన్నాయి. పీఎన్‌బీ ప్రస్తావించకపోయినప్పటికీ.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ మొదలైనవి ఎల్‌వోయూ ఆధారంగా రుణాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్‌కి సంబంధించి సస్పెండైన వారిలో డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి తదితరులు ఉన్నారు. 2010 మార్చి 31 నుంచి ఆయన ముంబైలోని పీఎన్‌బీ ఫారెక్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, లావాదేవీలను పసిగట్టలేని విధంగా ఖాతాల్లో ఎంట్రీలు చేయకుండా.. మరో ఉద్యోగి మనోజ్‌ ఖారత్‌తో కలిసి ఆయన వివాదాస్పద ఎల్‌వోయూలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ ఖాతాదారు థర్డ్‌ పార్టీకి చెల్లించాల్సిన మొత్తానికి హామీనిస్తూ బ్యాంకులు ఈ ఎల్‌వోయూలను జారీ చేస్తుంటాయి. వీటి ఆధారంగా విదేశాల్లోని బ్యాంకు శాఖలు రుణాలు ఇస్తుంటాయి.

పీఎన్‌బీ 10 శాతం పతనం 
రూ.11,300 కోట్ల స్కామ్‌ నేపథ్యంలో బుధవారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో 10 శాతం నష్టంతో రూ.146 వద్ద ముగిసింది. ఒక్క రోజులో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,844 కోట్లు హరించుకుపోయి రూ.35,365 కోట్లకు పడిపోయింది.   పీఎన్‌బీ స్కామ్‌కు తోడు మొండి బకాయిల నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేయడం కూడా ప్రతికూల ప్రభావం చూపడంతో బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి. ఎస్‌బీఐ 4 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8 శాతం,అలహాబాద్‌ బ్యాంక్‌ 7.7 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 7.4 శాతం, కెనరా బ్యాంక్‌ 5.8 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 4.4 శాతం, ఐడీబీఐ బ్యాంక్‌ 4.2 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.7 శాతం చొప్పున పతనమయ్యాయి.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top