 
															ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని
జయపురం: ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ గదిలో శుక్రవారం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొరాపుట్ జిల్లా జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఈ విషాద సంఘటన జరిగింది. ఆ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నింపడంతో పాటు భయాందోళన రేకెత్తించింది. వివరాలిలా ఉన్నాయి.
భయాందోళనకు గురైన హాస్టల్ విద్యార్థినులు
మధ్యాహ్న భోజనాల సమయానికి ఆ విద్యార్థిని రాక పోవడంతో సహచర విద్యార్థినులు ఆమెను పిలిచేందుకు వెళ్లారు. ఎంత పిలిచినా జవాబు లేదు. అంతేకాకుండా తది తలుపులకు లోన గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీ లోంచి స్నేహితులు చూడగా  దూలానికి వేలాడుతున్న విద్యార్థిని మృతదేహం కనిపించింది, అది చూసిన వారు భయపడి పరుగుతీసి ఉపాధ్యాయులకు విషయం తెలిపారు. వెంటనే ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చందన పట్నాయక్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని  బొయిపరిగుడ సమితిలోని రామగిరి గ్రామానికి చెందిన బింగుచారి కుమార్తె  విలాసిని చారి. 9 వ తరగతి చదువుతూ ఆదర్శపాఠశాల హాస్టల్‌లో ఉంటోంది.  అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. హాస్టల్ సూపర్‌వైజర్, ఉపాధ్యాయిని సరోజ నాయక్  మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు  విలాసిని రాసి సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం  విద్యార్థిని మృత దేహాన్ని    పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. 
పోలీసుల అదుపులో టీచర్
కొద్ది రోజుల కిందట ఉపాధ్యాయురాలు సరోజ నాయక్  ఇష్టం వచ్చినట్లు తిట్టి మానస క్షోభకు గురిచేసిందని అందుచేతనే తన కుమార్తె విలాసిని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై మృతురాలి సోదరుడు డొంబురు దొర చారి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
