వాట్సప్‌ లో పుకార్లు.. అమాయకుడి మృతి | Sakshi
Sakshi News home page

వాట్సప్‌ లో పుకార్లు.. అమాయకుడి మృతి

Published Wed, May 23 2018 10:13 AM

Misguided Villagers Attack on Tribals In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. జనాల్లో నెలకొన్న అనుమానాలు, భయాలు  అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. భీమ్ గల్ మండలం చెంగల్‌లో ఇలాంటి అనుమానాలతోనే ఇద్దరు గిరిజనులను జనాలు తీవ్రంగా చితకబదారు. దాడిలో గాయపడ్డ ఒకరు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. చెంగల్ సమీపానికి ఉన్న తాండాలకు చెందిన దేవాగత్‌ లాలూ, అతని బావమరిది మాలావత్‌ దేవ్యా అనే గిరిజనులు మామిడి కాయల కోసం ఓ తోటలోకి వచ్చారు.

సరిగ్గా అదే సమయానికి నీళ్లకోసం అటుగా వెళ్లిన పశువుల కాపరి వాళ్లను చూసి భయపడి తన తండ్రికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఇద్దరినీ కర్రలతో తీవ్రంగా చితకబాదారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ భవనం వద్ద బంధించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు దేగావత్‌ లాలూను ఆర్మూరు మహాత్మాగాంధీ ఆస్పత్రికి, మాల్యావత్‌ దేవ్యాను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు.

గ్రామస్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన దేవ్యా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడిది దర్పల్లి మండలం ధనబండ తాండాగా పోలీసులు గుర్తించారు. ప్రజలు భయంతోనే వారిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది చెంగల్‌ గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం ముందస్తు జాగ్రత్తగా చెంగల్‌లో భారీ పోలీస్‌ బందోబస్తు చేర్పాటు చేశారు. అనంతరం పోలీసుల మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, వాస్తవాలను గుర్తించాలని కోరారు. ఏదైనా అనుమానంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Advertisement
Advertisement