కాటేసిన మైనర్ల ప్రేమ..!

Minor Girl Suicide Commits In Nalgonda - Sakshi

రెండు కుటుంబాలవి పక్క పక్క ఇళ్లే.. తెలిసీ    తెలియని వయసులో ఇద్దరు మైనర్లలో ఆకర్షణ మొదలైంది. అది పరిచయానికి దారితీసి ఇద్దరి మనసులు కలిశాయి..కొంతకాలంగా సాగుతున్న వారి ప్రేమ హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటికి పొక్కడంతో పెద్దల మధ్య విభేదాలు పొడచూపాయి. తమ ప్రేమను ఒప్పుకోరనో..? విడిచి ఉండలేనని నిర్ణయించుకుందో..? మరో కారణమో తెలియదు కానీ ఆ బాలిక బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

నాంపల్లి (మనుగోడు) : నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఇద్దరు మైనర్ల కుటుంబాలు పక్కపక్కనే నివాసముంటున్నాయి. బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివి కూలి పనులకు వెళ్తుండగా బాలుడు ఇంటర్మీడియట్‌ చదువుతూ ఆటో నడుపుతున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలిక పత్తికూలికి ఆ బాలుడి తండ్రి ఆటోలోనే వెళ్లేది. అలా తండ్రి లేని సమయంలో బాలుడు ఆటో నడుపుతుండగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

హద్దులు దాటి.. గర్భందాల్చి..
ఇద్దరు మైనర్లే కావడం.. జీవితంపై అవగాహన లేకపోవడం.. సినిమాల ప్రభావం వెరసి వారి ప్రేమ కాలక్రమేణా హద్దులు దాటింది. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ తమను వేరు చేస్తారో అన్న భయాందోళనతో బాలిక మిన్నకుండిపోయింది. బాలిక ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో ఏడు నెలల గర్భవతి అని తెలియడంతో కుటుంబ సభ్యులు నిలదీయడంతో తమ ప్రేమాయణం బయటపెట్టింది.

ప్రేమికుల మధ్య వాగ్వాదం
అయితే, శుక్రవారం సాయంత్రం బాలిక కుటుంబాలు ఇంట్లోనే మంతనాలు జరుపుతున్నారు. ఈ సమయంలో బాలుడు వారి ఇంటి ఎదురుగా నుంచి వెళ్తుండగా బాలిక గమనించింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సదరు బాలుడు కోపోద్రిక్తుడై బాలికపై చేయి చేసుకున్నాడు. 

బాలుడి ఇంటి ఎదుట ధర్నా..
బాలిక మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు మధ్యాహ్నం బాలుడి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే బాలుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక మృతికి కారణమైన సదరు బాలుడితో పాటు అతడి తండ్రిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు నాంపల్లి ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. 

అబార్షన్‌ చేయించమని..
విషయం తెలుసుకుని కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం సదరు ప్రేమికుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రిని నిలదీశారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విషయం తర్వాత చర్చిద్దామని తొలుత బాలికకు అబార్షన్‌ చేయించమని బాలుడి తండ్రి సూచిం చాడు. అందుకు రూ.5వేలు కూడా ముట్టజెప్పాడు. అయితే ఆస్పత్రికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు ఏడు నెలల గర్భానికి అబార్షన్‌ చేయాలంటే రూ. 25వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్‌ చేయగా స్వీచ్‌ ఆఫ్‌ రావడం,  తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగివచ్చారు. 

పురుగుల మందు తాగి..
వారిద్దరి మధ్య ఏం విషయంలో వాగ్వాదం జరిగిందో, ప్రేమికుడు చేయిచేసుకున్నాడనో.. పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిందో తెలియదు కానీ వెంటనే ఇంట్లోకి వెళ్లిన బాలిక పురగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు సదరు బాలికను నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా  మృతిచెందింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top