వయసు18...చోరీలు16 | Minor Boy Arrest In Bike Robbery Case hyderabad | Sakshi
Sakshi News home page

వయసు18...చోరీలు16

Sep 5 2018 8:01 AM | Updated on Sep 5 2018 8:01 AM

Minor Boy Arrest In Bike Robbery Case hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న బైకులు

సాక్షి, సిటీబ్యూరో:  పదహేరేళ్ల వయస్సు నుంచే బైక్‌ల చోరీలకు పాల్పడుతూ  మూడుసార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చి మళ్లీ నేరాల బాట పట్టి హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన బాలనేరస్తుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వనపర్తి జిల్లా, కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడు(18) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఉపాధి నిమిత్తం నగరానికి వలసవచ్చిన అతను బోరబండలో ఉంటూ బైక్‌ మెకానిక్‌ సెంటర్‌లో పని చేసేవాడు. ఈ క్రమంలో చెడు అలవాట్లకు బానిసైన అతను బైక్‌లపై ఉన్న మోజుతో వాటిని చోరీ చేసి సరదాగా షికార్లు చేసేవాడు. 2016లో నకిలీ తాళాలతో దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బైక్‌ చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి బైక్‌  జువనైల్‌ హోమ్‌కు తరలించారు. బయటికి వచ్చినా తీరు మార్చుకోని అతను 2017లో రైల్వే స్టేషన్లు, ఆలయాలు, కార్యాలయాలు, రోడ్డు పక్కన పార్క్‌ చేసే వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డాడు. 2017, 2018లో పోలీసులు అ తడిని జువనైల్‌ హోమ్‌కు తరలించారు.  

రెండు నెలల్లో 16 చోరీలు...
జూలై నెలలో జువనైల్‌ హోమ్‌ నుంచి బయటికి వచ్చిన ఇతను    కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌ నగర్, సైఫాబాద్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో 16 బైక్‌లను ఎత్తుకెళ్లాడు. వరుస చోరీలకు తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మాదాపూర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎస్‌ఐ విజయ్, హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రసాద్, దాసు, రవీందర్‌ రెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సనత్‌నగర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు పాత  నేరస్తుడి పనిగా నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుంచి అతడి కదలికలపై నిఘా ఉంచిన మాదాపూర్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం బోరబండ రైల్వే స్టేషన్‌ సమీపంలో అతడిని పట్టుకున్నారు. రూ.15 లక్షల విలువైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మాదాపూర్‌లో రెండు, కేపీహెచ్‌బీలో మూడు, సనత్‌నగర్‌లో నాలుగు, కూకట్‌పల్లిలో రెండు, ఎస్‌ఆర్‌నగర్‌లో రెండు, బంజారాహిల్స్‌లో ఒకటి, సైఫాబాద్‌లో ఒకటి, మియాపూర్‌లో ఐదు బైక్‌లు చోరీ చేసినట్లు తెలిపారు.   

పెట్రోల్‌ అయిపోతే మరో బైక్‌
నకిలీ తాళాలతో బైక్‌లు చోరీ చేస్తున్న ఇతను ఇప్పటివరకు ఒక్క బైక్‌ను కూడా ఎక్కడా విక్రయించలేదు. చోరీ చేసిన బైక్‌పై షికారు చేస్తుండగా పెట్రోల్‌ అయిపోతే ఆ బైక్‌ను అక్కడే వదిలేసి వెళ్లేవాడు. అనంతరం సమీపంలో మరో బైక్‌ను చోరీ చేసి పెట్రోల్‌ అయిపోయేంత వరకు దానిపై తిరిగేవాడు. పలు రకాల బైక్‌లు నడపాలన్న కోరికతో దారి తప్పిన ఈ బాలనేరస్తుడు  పోలీసులకు చుక్కలు చూపించినా సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దొరికిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement