అత్తింటి వేధింపులకు వివాహిత బలి

Married Women Suicide With Extra Dowry Assults in Hyderabad - Sakshi

చందానగర్‌: మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అహ్మద్‌ పాషా సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన విశ్వనాథ్, పద్మజ కుమారుడు కంకణాల సంతోష్‌కు, శ్రీకాకుళం రాజాంకు చెందిన మోహన్‌రావు, విజయల రెండవ కూతురు స్రవంతి(31)లకు 2017 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వారికి రెండు సంవత్సరాల కుమారుడు శషాంక్‌ ఉన్నాడు.సంతోష్‌ తల్లితండ్రులు 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. వీరు శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని ముప్పా అపార్ట్‌మెంట్‌లోని 305 ప్లాట్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌లో సంతోష్‌ తల్లి వచ్చి వీరి వద్దే ఉంటోంది. కాగా స్రవంతి భర్త సంతోష్, అత్త, మామలు తనను వేధిస్తున్నారని 2018 ఆగస్టులో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ముడు నెలలకు వారి మధ్య రాజీ కుదిరింది.

సోమవారం రాత్రి కూడా భర్త సంతోష్, అత్తతో గొడవ జరిగింది. ఈక్రమంలో అనుమానాస్పద స్థితిలో స్రవంతి మంగళవారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని వారు ఉంటున్న మూడవ అంతస్తు నుంచి లిఫ్ట్‌ ద్వారా సెల్లార్‌లో కిందకు వచ్చి లిఫ్ట్‌ డోర్‌ వద్ద పడిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు చూసి ఇంట్లో ఉన్న వారికి, పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లిన పెట్రోలింగ్‌ పోలీసులు వెళ్లి చూసే సరికి ఆమె ఒంటిపై దుస్తులు కాలిపోయి మృతి చెంది ఉంది. సోమవారం సాయంత్రం బయటికి వెళ్లిందని అప్పుడు వెంట పెట్రోల్‌ తెచ్చుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి ఒంటికి నిప్పంటించుకొని మూడు అంతస్తుల నుంచి కిందకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్రవంతి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top