‘హీరా’ టు ‘ఐఎంఏ’

Mansur Khan Working in Heera Groups Hyderabad - Sakshi

గతంలో నౌహీరా సంస్థలో పని చేసిన మన్సూర్‌ ఖాన్‌

మాసబ్‌ట్యాంక్‌ కార్యాలయంలో కన్సల్టెంట్‌గా విధులు

ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసిన సీసీఎస్‌

సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు కేంద్రంగా చోటు చేసుకుని దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన పోజీ స్కామ్‌ ఐ మానిటరీ అడ్వైజరీకి (ఐఎంఏ) మూలం హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌గా తెలుస్తోంది. నౌహీరా షేక్‌కు చెందిన ఈ సంస్థల్లో కొన్నాళ్ళు పని చేసిన మన్సూర్‌ఖాన్‌ బెంగళూరు వెళ్లి సొంతంగా ఐఎంఏను ప్రారంభించినట్లు సమాచారం. ఇతడి విషవృక్షం విస్తరించడంలో అక్కడి రాజకీయ నాయకులు, మత గురువుల పాత్ర సైతం ఉందని బాధితుడు, రిటైర్డ్‌ గెజిటెడ్‌ లెక్చరర్‌ ఎం.మహబూబ్‌ బాష ‘సాక్షి’కి తెలిపారు. నగరానికి సంబంధించి ఆరుగురు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముగ్గురు బాధితులకు బుధవారం నోటీసులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన మన్సూర్‌ ఖాన్‌ కొన్నాళ్లు నగరంలో నివసించాడు. అప్పట్లో మాసబ్‌ట్యాంక్‌లోని హీరా గ్రూప్‌  కార్యాలయంలో కన్సల్టెంట్‌గా పని చేశాడు. పోజీ స్కామ్స్‌ నిర్వహణలో ఉండే లోటుపాట్లను తెలుసుకున్న మన్సూర్‌ ఆపై తన మకాంను బెంగళూరుకు మార్చాడు. అక్కడి శివాజీనగర్‌లో ఐఎంఏ కార్యాలయాన్ని స్థాపించి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు. బంగారం వ్యాపారం చేయడంతో పాటు ప్రింటింగ్‌ ప్రెస్, హాస్పిటల్, మెడికల్‌ షాపులు, స్కూల్, అపార్ట్‌మెంట్స్, సూపర్‌మార్కెట్స్‌ సైతం నిర్వహించింది.

వివిధ స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించింది. శివాజీనగర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, కొందరు రాజకీయ నాయకులతో పాటు మతగురువులు సైతం మన్సూర్‌కు సహకరించారని మహబూబ్‌బాష తెలిపారు. వారు చెప్పడం, బెదిరించడం తదితర చర్యల కారణంగా అనేక మంది అప్పటికే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉన్న తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకుని ఐఎంఏలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఐఎంఏ కర్ణాటక మొత్తం విస్తరించిందని, ఆపై దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వరంగల్, మెదక్, నిర్మల్‌ల్లోనూ బాధితులు ఉన్నారు. ఇప్పటికే హీరా గ్రూప్‌ చేసిన నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంఐఎం నేత షాబాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఐఎంఏ బాధితులకూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రానికి షాబాజ్‌ను 57 మంది బాధితులు సంప్రదించారు. వీరికి అవసరమైన న్యాయసహాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని షాబాజ్‌ ఖాన్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఆరుగురు బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) బుధవారం మహబూబ్‌ బాషతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెకు నోటీసులు జారీ చేశారు. గురువారం సీసీఎస్‌ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు అ«ధికారి ఎదుట హాజరుకావాలని, ఐఎంఏలో పెట్టుబడులకు సంబంధించిన పూర్తి ఆధారాల అసలు ప్రతులు, గుర్తింపు కార్డులు తీసుకురావాలని అందులో కోరారు. వీరి నుంచి గురువారం వాంగ్మూలాలు సైతం నమోదు చేసే అవకాశం ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top