ప్రణాళిక ప్రకారమే హత్య

man murder case mystery revealed - Sakshi

వీడిన కోన చంద్రశేఖర్‌ మర్డర్‌ మిస్టరీ

వేధింపులు భరించలేక తోటి దొంగ, పాత కక్షతో మరొకరు కలిపి అంతమొందించారు

వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

సబ్బవరం(పెందుర్తి): డబ్బులు కోసం డిమాండ్‌ చేస్తూ వేధిస్తున్నాడని ఒకరు... తన తమ్ముడిని కొట్టాడని కక్షతో ఒకరు... కలిసి ప్రణాళిక రచించి ఓ పాత నేరస్తుడిని హతమార్చారు. గత నెల 29న రాత్రి మెగలిపురం సమీపంలోని టెరాకాన్‌ లే అవుట్‌ వద్ద రోడ్డు పక్కన సబ్బవరంలోని దుర్గానగర్‌ కాలనీకి చెందిన కోన చంద్రశేఖర్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుని సోదరి మంగళగిరి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌లో అనకాపల్లి రూరల్‌ సీఐ జి.రామచంద్రరావు, ఎస్‌ఐ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. సబ్బవరంలోని దుర్గానగర్‌ కాలనీకి చెందిన కోన చంద్రశేఖర్, బాటజంగాలపాలెంకు చెందిన సిలారపు కుమార్‌(25), నాగేంద్ర కలిసి దొంగతనాలు చేస్తుండేవారు. వీరు ముగ్గురు పెందుర్తి, సబ్బవరం, పరవాడ, గాజువాక మండలాల్లో 2013, 2014వ సంవత్సరాలలో పలు దొంగతనాలకు పాల్పడడంతో 8 కేసులు నమోదయ్యాయి. అప్పట్లో వీరిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో 2014లో బెయిల్‌పై వచ్చారు. దొంగగా మారిన తమ్ముడు కోన చంద్రశేఖర్‌ను అతని అక్కలు ఇంటికి రానివ్వలేదు. అప్పటి నుంచి పాతరోడ్డు సమీపంలోని షకీలా దాబాలో ఆశ్రయం పొందాడు.

డబ్బులు కోసం వేధిస్తుండడంతో...
జైలు నుంచి వచ్చిన తర్వాత సబ్బవరం ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని సిలారపు కుమార్‌ తీసుకుని విజయవాడ వెళ్లిపోయాడు. ఆమె గర్భవతి కావడంతో కొన్ని నెలల కిందట తీసుకుని సబ్బవరం వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న కోన చంద్రశేఖర్‌... మన ఇద్దరిపై పలు స్టేషన్‌లలో ఉన్న కేసులు కొట్టించేశానని, అందుకు అయిన ఖర్చులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే తను మరలా దొంగతనాలు చేస్తానని, కేసులన్నీ నీపైకి వస్తాయని కుమార్‌ను చంద్రశేఖర్‌ బెదిరించాడు. దీంతో అప్పట్లో రూ.6వేలు కుమార్‌ ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడంతో ఎలాడైనా చంద్రశేఖర్‌ను అడ్డు తొలగించుకోవాలని కుమార్‌ ఆలోచన చేశాడు. అందుకోసం బీహార్‌ నుంచి 15 సంవత్సరాల కిందట నరవ వచ్చి టైర్లు పంక్చర్లు వేసుకుంటూ జీవిస్తున్న మహ్మద్‌ అలంగేర్‌అలియాస్‌ చంద్‌తో చేతులు కలిపాడు.

గతంలో తన తమ్ముడు సాజిత్‌ను చంద్రశేఖర్‌ కొట్టడంతో కక్ష పెంచుకున్న మహ్మద్‌ అలంగేర్‌ వెంటనే అందుకు అంగీకరించాడు. వీరిద్దరూ కలిసి కోన చంద్రశేఖర్‌ అడ్డు తొలగించుకోవాలని నెల రోజుల కిందట ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా గతంలో తాను దొంగలించిన ఫోన్‌తో చంద్రశేఖర్‌కు మహ్మద్‌ గత నెల 29న ఫోన్‌ చేశాడు. కుమార్‌ డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడని, రావాలని కోరాడు. అదే రోజు రాత్రి నరవలో ఆటో బుక్‌ చేసుకుని సబ్బవరం కాంప్లెక్స్‌లో శేఖర్‌ను ఎక్కించుకుని రెండు బీర్లు తీసుకుని మొగలిపురంలోని టెరాకాన్‌ లే అవుట్‌ సమీపానికి చేరుకున్నారు. ముందే అనుకున్న ప్రకారం శేఖర్‌ మత్తులోకి జారుకున్నాక కుమార్, మహ్మద్‌ కలిసి రాడ్డుతో మోది, కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి  పరారైపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీర్‌ బాటిళ్లపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏ1 సిలారపు కుమార్, ఏ2 మహ్మద్‌ అలంగెర్‌లను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top